హైదరాబాద్: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వాతావరణశాఖ హెచ్చరించినట్లుగానే భారీగా పగటి ఉష్ణోగ్రతలు (46 డిగ్రీలకు పైగా) నమోదవుతున్నాయి. దాంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎన్నో కుటుంబాలలో ఎండలు విషాదాన్ని నింపుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎండలకు తట్టుకోలేక ఓ వ్యక్తి తలపై కానుగ ఆకుల కొమ్మను కట్టుకుని సేదతీరుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భానుడి భగభగలకు మనుగడ సాగించడం తెలంగాణలో కొన్ని జిల్లాల ప్రజలకు కష్టంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన వడగాల్పుల తీవ్రతకు అద్దం పట్టే ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎండల తీవ్రతను తట్టుకోలేక ఒక వ్యక్తి తన తలపై పచ్చటి కానుగ ఆకులను కవచంలా పెట్టుకుని బైకు మీద ప్రయాణిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచోన మొదట కాస్త వింతగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఎండల తీవ్రతకు అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో, ఎండల బారి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఇలాంటి మార్గాలను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, డెలివరీ బాయ్స్, రైతులు, అత్యవసర పనులపై రోడ్లెక్కి గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ వేసవి కాలం ఒక పెద్ద సవాలుగా మారింది. ఎండ తీవ్రత కేవలం అసౌకర్యానికే పరిమితం కాకుండా, ప్రాణాలు సైతం తీస్తోంది. రోడ్ల నుంచి వచ్చే సెగలు, వీస్తున్న వేడి గాలుల మధ్య ప్రయాణించే వారు ఆ వ్యక్తికి వచ్చిన ఈ కానుగ ఆకుల ఐడియాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Under the blazing Telangana summer sun, survival itself is becoming an innovation.

A striking visual circulating on social media captured the reality of the ongoing heat wave in the state, a man riding a motorcycle with fresh Pongamia Pinnata (Kanuga) leaves placed on his head,… pic.twitter.com/YuaGJHP5Bk

— Jacob Ross (@JacobBhoompag) May 23, 2026

ఎండ బారి నుంచి కాపాడుకుంటున్నావు సరే.. మరి బైకుకు ప్రమాదం జరిగితే నీ ప్రాణాల పరిస్థితి ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎండల బారి నుంచి కాపాడుకోవడం ఒకే.. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ లేకపోవడంతో నీ ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సైకిల్ మీద వెళ్లే వారికి మాత్రమే ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని అంటున్నారు. కానుక ఆకులతో ఎండ నుంచి తప్పించుకోవచ్చు, కానీ ప్రమాదం నుంచి ప్రాణాలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోలేవు అని కామెంట్ చేస్తున్నారు. అందరూ ఇలా చెట్ల కొమ్మలు పీకేసి తలపై పెట్టుకుంటే చెట్లు మిగలవు అని సెటైర్లు వేస్తున్నారు.

తెలంగాణలో ఇట్లున్నయి ఎండలు.. మస్తు ఎండ కొడుతుందని అన్నారు. మీరు కూడా ఇలాగే కానుక ఆకులు, చెట్ల కొమ్మలు కప్పుకుని ఎండల నుంచి ఉపశమనం పొందాలని సైతం సూచించారు. తెలంగాణలో అందరూ ఇలాగే బయట తిరగాలని సూచించారు. వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరికలను మరింత తీవ్రం చేస్తున్న సమయంలో ఈ వైరల్ వీడియో ఒక హెచ్చరికలా కనిపిస్తోంది. పెరుగుతున్న ఈ అసాధారణ ఉష్ణోగ్రతలు తెలంగాణవ్యాప్తంగా సామాన్యుడి రోజువారీ జీవితాన్ని, వారి ప్రయాణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఈ ఘటనే స్పష్టం చేస్తోంది.

తెలంగాణలో భానుడి భగభగలు: వడదెబ్బతో 31 మంది మృతి!
తెలంగాణలో ఎండల తీవ్రతకు శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై 31 మంది మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. మృతుల్లో ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, వరంగల్‌లో ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అత్యధికంగా 46.5 డిగ్రీలు... జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 46.4 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల వరకు చేరవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రానున్న ఆది, సోమవారాల్లో తూర్పు, ఉత్తర జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే, శనివారం కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది.