Virtual Mahanadu: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు నిర్వహణలో టీడీపీ అధిష్టానం కీలక మార్పులు చేసింది. తొలుత నెల్లూరు వేదికగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దీనిని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మే 27, 28 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి మహానాడును పూర్తి ఆడంబరాలకు దూరంగా, కేవలం రెండు రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు.

కేంద్ర కార్యాలయంలోనే ప్రధాన వేదిక

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి భౌతికంగా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలను ఆహ్వానిస్తున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ఈ సభకు హాజరవుతారు. ప్రధాన తీర్మానాలు, చర్చలు , పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఈ వేదిక నుంచే చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. వేదిక మారినా మహానాడు సంప్రదాయాలు, తీర్మానాల ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండదని పార్టీ స్పష్టం చేసింది.

డిజిటల్ పద్ధతిలో ఐదు లక్షల మంది భాగస్వామ్యం

భారీ బహిరంగ సభకు బదులుగా టెక్నాలజీని వాడుకుంటూ కిందిస్థాయి కార్యకర్తలను అనుసంధానం చేయడమే ఈ హైబ్రిడ్ మోడల్ ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల నుంచే ఆన్‌లైన్ విధానంలో ఈ మహానాడుకు హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు తమ తమ నియోజకవర్గ కేంద్రాల నుంచే డిజిటల్ స్క్రీన్ల ద్వారా మంగళగిరి సభలో పాలుపంచుకుంటారు. దీనివల్ల భారీగా ఇంధనం, రవాణా ఖర్చులు ఆదా అవ్వడంతో పాటు సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతున్నారు.

పొదుపు మంత్రం..

ప్రభుత్వ పరంగా పొదుపు చర్యలు పాటిస్తున్న తరుణంలో, పార్టీ పండుగను కూడా తక్కువ ఖర్చుతో అర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సభ వల్ల అయ్యే కోట్లాది రూపాయల ఖర్చును నివారించి, ఆ సమయాన్ని పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగించాలని భావిస్తున్నారు. ఆడంబరాల కంటే పనితీరుకే ప్రాధాన్యత ఇస్తామని ఈ హైబ్రిడ్ మహానాడు ద్వారా టీడీపీ మరోసారి నిరూపించుకోనుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.