Trisha entering politics: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘనవిజయం సాధించిన విజయ్, నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. అయితే, ఆ ఖాళీ అయిన స్థానంలో హీరోయిన్ త్రిష పోటీ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. రాజకీయాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆమె మొత్తుకుంటున్నా ఆమెను పొలిటికల్ క్వీన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజీనామాతో మొదలైన ఊహాగానాలు.. మంత్రి పదవిపై లెక్కలు!

విజయ్ రాజీనామా చేసిన క్షణం నుండే ఉప ఎన్నికల సమీకరణాలు మొదలయ్యాయి. త్రిష ఈ స్థానం నుండి బరిలోకి దిగుతారని, గెలిచిన వెంటనే విజయ్ కేబినెట్‌లో ఆమెకు కీలక మంత్రి పదవి దక్కుతుందని సామాజిక మాధ్యమాల్లో విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆమె అమిత్ షాను కలిశారని, బీజేపీ-టీవీకే మధ్య వారధిలా వ్యవహరించారని సాగిన పాత ప్రచారాలను కూడా దీనికి ముడిపెడుతున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది ఎవరికీ తెలియదు.

స్పష్టత ఉన్నా అదే ప్రచారం

వాస్తవానికి, త్రిష తన రాజకీయ వైఖరిపై ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చారు. తమిళనాడు బీజేపీ నేతలు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల సందర్భంలో స్పందిస్తూ.. తనకు రాజకీయ ఆకాంక్షలు లేవని, సినిమా కెరీర్‌కే తన తొలి ప్రాధాన్యత అని ఆమె తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ఆమె టీవీకే పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యురాలు కూడా కాదు. పార్టీ ప్రచారంలో కానీ, విధాన నిర్ణయాల్లో కానీ ఆమె ప్రమేయం శూన్యం. అయినప్పటికీ, విజయ్‌తో ఉన్న దశాబ్దాల స్నేహాన్ని సాకుగా చూపుతూ ఆమెను రాజకీయాల్లోకి లాగడం సెన్సేషన్ తప్ప మరేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయ్ రిస్క్ తీసుకుంటారా?

కొత్తగా అధికారం చేపడుతున్న తరుణంలో విజయ్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. సున్నితమైన రాజకీయ పరిస్థితుల మధ్య, పార్టీతో ఎలాంటి సంబంధం లేని సినీ తారలను అప్పటికప్పుడు తెరపైకి తీసుకురావడం రాజకీయంగా రిస్క్ తో కూడుకున్న పని. ప్రత్యర్థి పార్టీలు విమర్శించడానికి సిద్ధంగా ఉన్న వేళ, త్రిష వంటి వ్యక్తిగత సంబంధాలు ఉన్న వ్యక్తిని యాక్టివేట్ చేసి అనవసరమైన వివాదాలకు తావిచ్చే సాహసం విజయ్ చేస్తారని రాజకీయ పండితులు అనుకోవడం లేదు. వ్యక్తిగత స్నేహం వేరు, రాజకీయ బాధ్యతలు వేరని విజయ్ కూడా పలుమార్లు పరోక్షంగా సూచించారు.

ఇద్దరి మౌనమే అసలు సమస్య!

ఈ ఊహాగానాలకు తెరపడాలంటే కేవలం ఒక అధికారిక ప్రకటన సరిపోతుంది. కానీ, విజయ్ ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు , కేబినెట్ కూర్పులో నిమగ్నమై ఉండటం, త్రిష తన షూటింగ్‌లలో బిజీగా ఉండటంతో ఈ ప్రచారం మరింత ముదురుతోంది. ఈ గందరగోళానికి ముగింపు పలకాల్సిన బాధ్యత స్వయంగా విజయ్ లేదా త్రిషపైనే ఉంది. అంతవరకు తిరుచ్చి ఈస్ట్ ఖాళీ స్థానం చుట్టూ ఈ గ్లామర్ పాలిటిక్స్ ప్రచారాలు సాగుతూనే ఉంటాయి.