Tamilnadu AIADMK MLAs resign And Join TVK: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే దళపతి విజయ్ తన రాజకీయ చతురత ను ప్రదర్శించారు. అన్నాడీఎంకే ని కోలుకోలేని దెబ్బ తీస్తూ, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తన గూటికి చేర్చుకున్నారు.

తమిళనాడు రాజకీయ క్షేత్రంలో ముఖ్యమంత్రి విజయ్ తన మార్క్ రాజకీయాన్ని మొదలుపెట్టారు. అన్నాడీఎంకేలో అసమ్మతి సెగలు రాజేసి, ఆ పార్టీని బలహీనపరిచే వ్యూహానికి తెరలేపారు. సోమవారం సచివాలయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తమ పదవులకు రాజీనామా చేశారు. సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో స్పీకర్ వారి రాజీనామాలను తక్షణమే ఆమోదించారు. పదవులకు రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే వారు మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో అధికార తమిళగ వెట్రి కజగం పార్టీలో చేరిపోయారు.

ఇటీవల అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీవీ షణ్ముగం - ఎస్పీ వేలుమణి నేతృత్వంలో ఏకంగా 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే, పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు అనర్హత వేటు పడకుండా ఉండాలంటే సభలో 2/3 వంతు బలం ఉండాలి. అన్నాడీఎంకేకు ఉన్న ఎమ్మెల్యేల్లో 32 మంది ఉంటేనే చీలిక చెల్లుతుంది. ఆ బలం లేకపోవడంతో, విజయ్ ప్రభుత్వం ఒక పక్కా లీగల్ స్ట్రాటజీని అమలు చేసింది. పార్టీ ఫిరాయించి అనర్హత వేటు వేయించుకోవడం కంటే, స్వచ్ఛందంగా రాజీనామా చేసి వస్తే ఉపఎన్నికల్లో టికెట్ ఇస్తాం అని టీవీకే ఇచ్చిన హామీతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తెగించి ముందుకు వచ్చారు.

రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు కంచుకోట లాంటి పశ్చిమ తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. తమ సొంత చరిష్మాతో ఇక్కడ మళ్ళీ గెలవగలమనే ధీమాతోనే వీరు రాజీనామా చేశారు. టీవీకే చీఫ్ కోఆర్డినేటర్, సీనియర్ మంత్రి కేఏ సెంగోట్టయన్ వీరికి పూర్తి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూడు స్థానాల్లో టీవీకే గెలిస్తే, ఆ ప్రాంతంలో అన్నాడీఎంకే ప్రాబల్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టవచ్చని విజయ్ భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌తో అన్నాడీఎంకేలో చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న షణ్ముగం బృందానికి కూడా గట్టి సంకేతాలు పంపినట్లయింది.

#WATCH | Tamil Nadu | Three AIADMK MLAs, Maragatham Kumaravel, Sathyabama, and Jayakumar, met Minister Aadhav Arjuna

They tendered their resignation to Assembly Speaker JCD Prabakaran earlier today.

(By-elections will be held for these three constituencies along with Tiruchi… pic.twitter.com/bBQN0QZ4RL

— ANI (@ANI) May 25, 2026

ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయంతో తిరుగుబాటు క్యాంప్‌లో కలకలం రేగింది. ఉపఎన్నికలకు వెళ్లడం అంటే రిస్క్ అని భావించిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వెంటనే యూ-టర్న్ తీసుకున్నారు. వారు షణ్ముగం వర్గం నుంచి బయటకు వచ్చి, మళ్ళీ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి కి మద్దతు ప్రకటించారు. దీంతో తిరుగుబాటు వర్గం బలం 25 నుంచి 17కి పడిపోగా, ఈపీఎస్ తన బలాన్ని 27కి పెంచుకుని పార్టీపై పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ముగ్గురి బాటలో మరికొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి.

ప్రస్తుత పరిణామాలతో తమిళనాడులో త్వరలోనే నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరగడం ఖాయమైంది. ముఖ్యమంత్రి విజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంతో పాటు, ఇప్పుడు రాజీనామా చేసిన ఈ మూడు స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఈ ఉపఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న విజయ్, అక్కడ గెలిచి తన పవర్ ఏంటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అన్నాడీఎంకే మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.