Tamil Nadu CM Vijay | తమిళ వెట్రి కళగం (TVK) అధినేత జోసెఫ్ విజయ్ ఆదివారం (మే 10న) నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో రాష్ట్రంలో మరో కొత్త నేత సీఎం పీఠంపై కూర్చున్నారు. గతంలో తాను ఎక్కడ అవమానం ఎదుర్కొన్నాడో.. అదే చోట రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు.

విజయ్ తల్లిదండ్రులతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీవీకే కార్యకర్తలు, విజయ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున కార్యక్రమానికి తరలివచ్చి తమ హీరోను రియల్ హీరోగా చూసుకుని మురిసిపోయారు. విజయ్ తరువాత మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆధవ్ అర్జున, ఎన్. ఆనంద్, కె.ఎ. సెంగోట్టయ్యన్ వంటి ప్రముఖులు ఉన్నారు. తమిళనాడులో ద్రవిడ రాజకీయాల ఆధిపత్యం తర్వాత టీవీకే విజయంతో కొత్త శకం మొదలైంది.

దళపతి విజయ్ క్యాబినెట్ మంత్రులు వీరే.
ఎన్. ఆనంద్: టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ విజయ్‌కు అత్యంత సన్నిహితుడని తెలిసిందే. టి నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన పార్టీ సంస్థాగత దశ నుండి విజయ్‌ వెంట నడిచారు. గతంలో పుదుచ్చేరి నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.

ఆధవ్ అర్జున: చెన్నైలోని విల్లివక్కం నుంచి పోటీ చేసిన ఆయన డీఎంకే నేతను ఓడించి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు ఆధవ్ అర్జున. ఆయన ఆల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

కేజీ అరుణ్ రాజ్: మాజీ ఐఆర్ఎస్ (IRS) అధికారి, స్వతహాగా డాక్టర్ అయిన అరుణ్ రాజ్‌కు మంచి పేరుంది. పరిపాలనా అనుభవంతో పాటు పార్టీకి బలమైన వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన 2025లో టీవీకేలో చేరి తాజా ఎన్నికల్లో నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడు నుంచి విజయం సాధించారు.

సెంగోట్టయ్యన్: AIADMK మాజీ నేత, 8 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సెంగోట్టయ్యన్ టీవీకేలో చేరి గోబిచెట్టిపళయం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గతంలో జయలలిత, ఎడపాటి పళనిస్వామి ప్రభుత్వాల్లో మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం.

పి. వెంకట్రామన్: ఆడిటర్ వెంకట్రామన్‌గా ఆయనకు పేరుంది. ఆర్థిక వ్యూహాలు, ఎన్నికల నిర్వహణలో నిపుణుడిగా రాణించారు. టీవీకే నేత మైలాపూర్ నుంచి పోటీ చేసి పలువురు అగ్రనేతలను ఓడించి విజయం సాధించారు.

ఆర్ నిర్మల్ కుమార్: డిజిటల్ వ్యూహాలు రచించడంతో కీలకపాత్ర పోషించారు నిర్మల్ కుమార్. టీవీకే సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి విజయ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తిరుప్పరంకుండ్రం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రాజ్ మోహన్ ఆరుముగం: యువనేత రాజ్ మోహన్ టీవీకే తరఫున ఎగ్మోర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. Put Chutney యూట్యూబ్ ఛానెల్‌తో గుర్తింపు పొందిన ఆయనకు డిజిటల్ రాజకీయాల్లో మంచి పేరుంది. సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేయగల వ్యక్తి.

టి.కె. ప్రభు: కారైకుడి నుంచి ఎమ్మెల్యేగా నిలిచిన టీవీకే నేత టి.కె. ప్రభు ఒక డాక్టర్. ఆయన ఈ ఎన్నికల్లో ఎన్టీకే (NTK) అధినేత సీమన్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. ఆయన నిరాడంబరమైన వ్యక్తిత్వం, ప్రజల్లో ఉన్న పేరు ఎమ్మెల్యేను చేశాయి.

ఎస్. కీర్తన: శివకాశి నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఎస్ కీర్తన. 29 ఏళ్ల కీర్తన టీవీకేలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే. విజయ్ కేబినెట్‌లో యంగెస్ట్ మినిస్టర్, ఏకైక మహిళా మంత్రి ఆమెనే. పొలిటికల్ కన్సల్టెంట్‌గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన కీర్తన, తొలిసారి పోటీలోనే విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.