AIADMK MLAs side with Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచింది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే లో చీలిక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అన్నాడీఎంకేలో విజయ్‌కు మద్దతుగా 35 మంది ఎమ్మెల్యేలు

చెన్నైలోని అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం కార్యాలయం ఇప్పుడు రాజకీయ వ్యూహాలకు అడ్డాగా మారింది. పార్టీకి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలలో మూడింట రెండొంతుల మంది, అంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం కార్యాలయంలో భేటీ అయ్యారు. వీరంతా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి ని ఈ ఎమ్మెల్యేలు కలిసి, ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని లేదా బయటి నుంచి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

చారిత్రక తీర్పు.. ద్రావిడ పక్షాల వెనకడుగు

ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాలకే పరిమితం కాగా, డీఎంకే కేవలం 59 స్థానాలతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలి ప్రయత్నంలోనే విజయ్ పార్టీ 108 స్థానాలు సాధించి ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టింది. ప్రస్తుతం టీవీకేకు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించగా, మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తుండటం పళనిస్వామికి పెద్ద తలనెప్పిగా మారింది.

పార్టీ చీలికను కొట్టిపారేస్తున్న హైకమాండ్

అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాత్రం పార్టీలో ఎలాంటి చీలిక లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేరని ఆయన పేర్కొన్నారు. అయితే, టీవీకే మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎవరినీ మద్దతు కోరలేదని, మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఒకవేళ ఎడప్పాడి పళనిస్వామి గనుక మద్దతుకు నిరాకరిస్తే, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి విజయ్ వైపు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.

#WATCH | Chennai | "The ball is in Mr Vijay's court, and he has to take a conscious decision," says AIADMK National Spokesperson Kovai Sathyan, on being asked if his party will support TVK in gaining majority

"The ball is in Mr Vijay's court, and he has to take a conscious… pic.twitter.com/mXTLs3aLyz

— ANI (@ANI) May 6, 2026

విజయ్ పట్టాభిషేకానికి ముహూర్తం?

మరోవైపు, చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు, వామపక్ష పార్టీలు , విసికె నేతలతో టీవీకే ఇప్పటికే చర్చలు జరుపుతోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు గనుక లభిస్తే, ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయ్ ప్రభుత్వం కొలువుదీరుతుంది.