Why Trichy East bypoll not announced Vijay seat: తమిళనాడు రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఉపఎన్నికల చుట్టూ తిరుగుతోంది. నటుడు, తమిళగ వెట్రి కజగం అధినేత సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, రాష్ట్రంలో మొత్తం 7 స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం కేవలం రెండు నియోజకవర్గాలు మదురాంతకం, ధరాపురం మాత్రమే ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.

తిరుచ్చి ఈస్ట్ ఉపపఎన్నిక వాయిదా

విజయ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్', తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా ఉండకూడదు కాబట్టి, ఆయన తన ప్రధాన వేదికగా పెరంబూర్ స్థానాన్ని నిలుపుకుని తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. అయితే, విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానంతో పాటు మిగిలిన నాలుగు స్థానాల్లో స్థానిక న్యాయపరమైన పిటిషన్లు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో సాంకేతిక కారణాల రీత్యా ఈసీఐ అక్కడ ఎన్నికలను వాయిదా వేసింది. ప్రస్తుతం ఎలాంటి వివాదాలు లేని రెండు స్థానాలకే నోటిఫికేషన్ ఇచ్చింది.

విజయ్‌కు మద్దతివ్వని కమ్యూనిస్టులు

ఈ ఉపఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఈ ఎన్నికల్లో విజయ్‌కి షాక్ ఇవ్వడమే. అసెంబ్లీలో ప్రభుత్వ పతనానికి అవకాశం ఇవ్వకూడదని, బీజేపీ పరోక్ష ప్రవేశాన్ని అడ్డుకోవడానికే విజయ్‌కి బయట నుంచి మద్దతు ఇస్తున్నామని చెప్తున్న లెఫ్ట్ పార్టీలు.. ఉపఎన్నికల్లో మాత్రం టీవీకేతో కలవకుండా స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నాయి. చెన్నై సమీపంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, స్థానిక పరిశ్రమల ఏర్పాటు, అసెంబ్లీలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌పై విజయ్ చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలపై కమ్యూనిస్టులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ ఓటు బ్యాంకు ఉనికిని కాపాడుకోవడానికే సీపీఐ, సీపీఎంలు ప్రత్యేక అభ్యర్థులను నిలబెడుతున్నాయి.

పోటీ హోరా హోరీ

ప్రస్తుతం ఉపఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల్లోనూ త్రిముఖ పోటీ తీవ్రంగా ఉంది. అధికార టీవీకే-కాంగ్రెస్ కూటమి ఒకవైపు, ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే మరొకవైపు, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మరోవైపు హోరాహోరీగా తలపడుతున్నాయి. కమ్యూనిస్టులు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోతాయని, ఇది డీఎంకేకు కొంత లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు. అయినప్పటికీ, కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజాదరణ, సంక్షేమ పథకాల హామీలు టీవీకే కూటమికి సానుకూల అంశాలుగా మారాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌కి ఇది తొలి ప్రజా పరీక్ష . ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే ప్రజలు వ్యతిరేక తీర్పు ఇవ్వరనే సంప్రదాయం ప్రకారం టీవీకే కూటమికి ఈ రెండు స్థానాల్లోనూ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. అయితే, కమ్యూనిస్టుల తిరుగుబాటు , డీఎంకే గట్టి పోటీ ఇస్తుండటంతో విజయ్ స్వయంగా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచారానికి దిగుతున్నారు. ఒకవేళ విజయ్ కూటమి ఈ రెండు స్థానాలను గెలుచుకుంటే అసెంబ్లీలో ఆయన మ్యాజిక్ ఫిగర్ బలపడటమే కాకుండా, రాబోయే రోజుల్లో మిగిలిన స్థానాల ఉపఎన్నికలకు పెద్ద మైలేజ్ లభిస్తుంది.