IPL 2026 DC VS Ben Duckett: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ ఈ మెగా టోర్నీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను నిరాశపరిచాడు. వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ ఆయనను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్‌తో కలిసి డకెట్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని అందరూ భావించారు. అయితే ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌పై దృష్టి పెట్టాలనే నెపంతో అత‌డు ఈ నిర్ణయం తీసుకున్నాడు. డకెట్ తప్పుకోవడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కాంబినేషన్ పూర్తిగా దెబ్బతింది.

గవాస్కర్ ఘాటు విమర్శలు
చివరి నిమిషంలో టోర్నీ నుండి తప్పుకున్న డకెట్ తీరుపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, దిగ్గజ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇలాంటి విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. "ప్రస్తుతం ఉన్న రెండేళ్ల నిషేధ పాలసీ సరిగ్గా పనిచేయడం లేదు. ఆటగాళ్ల కెరీర్‌పై ప్రభావం చూపేలా మరిన్ని కఠిన నిబంధనలు తీసుకురావాలి. హండ్రెడ్ (The Hundred) టోర్నీలో మంచి ధరకు అమ్ముడుపోవడం వల్లే డకెట్ ఐపీఎల్‌ను వదులుకోవడానికి సిద్ధపడి ఉంటాడు. ఇంగ్లాండ్ టెస్ట్ కెరీర్ కోసమే తప్పుకున్నానని చెప్పడం విడ్డూరం" అని గవాస్కర్ తాజాగా పేర్కొన్నాడు.

🗣️ "It certainly wasn't the series and the campaign that I was hoping for"

Ben Duckett reflects on a difficult winter and his decision to turn down an IPL stint with the Delhi Capitals 🇮🇳

Watch the latest episode of The Scoop 👉 https://t.co/vZAdndR8SE pic.twitter.com/hbZ5yU7IDr

— Wisden (@WisdenCricket) March 29, 2026

డకెట్ వెర్షన్ ఏంటి?
ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ 1-4తో ఘోరంగా ఓడిపోయింది. ఈ సిరీస్‌లో డకెట్ కేవలం 20.2 సగటుతో పరుగులు చేసి విఫలమయ్యాడు. సిరీస్ మధ్యలో మద్యం మత్తులో కనిపించి వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. "ఆస్ట్రేలియాలో నా ప్రదర్శన పట్ల గర్వంగా ఏమీ లేదు. అందుకే ఐపీఎల్‌ను, భారీ మొత్తంలో వచ్చే డబ్బును వదులుకుని నాటింగ్ హామ్‌షైర్ (Notts) తరఫున కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇంగ్లాండ్ తరఫున ఆడటం నాకు ఎంత ముఖ్యమో నిరూపించుకోవడానికే ఈ అడుగు వేశాను" అని డకెట్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

బీసీసీఐ నిషేధ నిబంధన
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, వేలం తర్వాత వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో తప్పుకునే విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధిస్తోంది. దీనివల్ల వారు తదుపరి రెండు సీజన్లలో వేలానికి లేదా టోర్నీకి అనర్హులుగా మారుతారు. అయినా కూడా ప్లేయర్లు వెనక్కి తగ్గకపోవడంతో గవాస్కర్ లాంటి సీనియర్లు మరింత కఠినమైన శిక్షలు ఉండాలని కోరుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు డకెట్ స్థానంలో ఏ ఆటగాడిని తీసుకుంటుందో వేచి చూడాలి. గతంలో ఇంగ్లాండ్ కే చెందిన హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే వ‌రుస‌గా రెండుసార్లు చివ‌రి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అప్ప‌టి నుంచి రెండేళ్ల బ్యాన్ నిర్ణ‌యాన్ని బీసీసీఐ తీసుకొచ్చింది.