Share Market Updates:  షేర్ మార్కెట్ గత వారం రోజుల నుంచి చాలా అస్థిరంగా ఉంది. పెట్టుబడిదారులు ఈ వారం 16 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. గత వారంలో స్టాక్ మార్కెట్ సూచీలు నిఫ్టీ 50, BSE సెన్సెక్స్ రెండింటిలోనూ పాయింట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి.

విదేశీ పెట్టుబడిదారులు భారీ అమ్మకాలు (FIIs), అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో పడిపోవడం వంటివి భారత స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచాయి. శుక్రవారం అమెరికా డాలర్‌కు 92 రూపాయల వరకు చేరుకుంది. కానీ తరువాత కొద్దిగా కోలుకోవడంతో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే 91.90 రూపాయల వద్ద ముగిసింది.

శుక్రవారం కుప్పకూలిన షేర్ మార్కెట్

జనవరి 23న స్టాక్ మార్కెట్ పాజిటివ్ ధోరణితో ప్రారంభమైనప్పటికీ, అదానీ గ్రూప్ సహా అనేక పెద్ద కంపెనీల షేర్లలో భారీ పతనం కారణంగా అమ్మకాలకు ఒత్తిడి పెరిగింది. సురక్షిత ఆస్తుల వైపు ప్రజలు, పెట్టుబడుదారులు మొగ్గు చూపడం, నిరంతరం విదేశీ నిధులు బయటకు వెళ్లడం, బలమైన స్థానిక ప్రేరణల కొరత పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రభావితం చేసిందని ట్రేడర్లు PTIకి తెలిపారు.

శుక్రవారం 30 షేర్ల BSE సెన్సెక్స్ 769.67 పాయింట్లు లేదా 0.94 శాతం తగ్గి 81,537.70 వద్ద ముగిసింది. అయితే, ట్రేడింగ్ సమయంలో సూచీ 835.55 పాయింట్లు లేదా 1.01 శాతం పడిపోయి ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 81,471.82కి చేరుకుంది. BSEలో 2989 కంపెనీల షేర్లు నష్టాల్లో ముగియగా, 1229 పెరిగాయి. మరో 143 కంపెనీలు ఎటువంటి మార్పు లేకుండా ముగిశాయి.

షేర్ మార్కెట్ బ్లడ్ బాత్

ఇదే సమయంలో 50 షేర్ల NSE నిఫ్టీ 241.25 పాయింట్లు లేదా 0.95 శాతం తగ్గి 25,048.65 వద్ద మార్కెట్ ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఇది 264.6 పాయింట్లు లేదా 1.04 శాతం పడిపోయి 25,025.30 కనిష్ట స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో BSE సెన్సెక్స్ 2,032.65 పాయింట్లు లేదా 2.43 శాతం నష్టపోయింది.

NSE నిఫ్టీలో కూడా 645.7 పాయింట్లు లేదా 2.51 శాతం క్షీణత నమోదైంది. శుక్రవారం ఒక్కరోజే BSEలో లిస్ట్ చేసిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 6,95,963.98 (6 లక్షల 95 వేల 9 వందల అరవై మూడు) కోట్లు తగ్గి 4,51,56,045.07 (4 లక్షల 51 వేల 56 వేల 45) కోట్లకు (4.93 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. మొత్తం వారంలో BSEలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 16,28,561.85 (16 లక్షల 28 వేల 5 వందల 85) కోట్లు తగ్గింది.

అదానీ గ్రూప్‌నకు భారీ షాక్

సెన్సెక్స్ టాప్ 30 కంపెనీలలో అదానీ పోర్ట్స్, ఇటర్నల్, ఇండిగో, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి ఇండియా, బజాజ్ ఫైనాన్స్, NTPC, ట్రెంట్, లార్సెన్ & టూబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టపోయాయి.

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ PTIతో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లు ఆలస్యం కావడం, లాభాల స్వీకరణ కారణంగా రియల్టీతో పాటు PSU బ్యాంక్ షేర్లు పడిపోయాయని తెలిపారు. అయితే అమెరికన్ రెగ్యులేటర్ ద్వారా సమన్లు చేస్తారనే వార్తల కారణంగా అదానీ గ్రూప్ షేర్లపై ఒత్తిడి పెరిగిందని తెలిపారు.

అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) అదానీ గ్రూప్‌పై చర్యలు చేపట్టింది. 265 మిలియన్ డాలర్ల లంచం కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలకు వ్యక్తిగతంగా ఈమెయిల్ ద్వారా సమన్లు జారీ చేయడానికి అనుమతించాలని SEC అమెరికా కోర్టును కోరింది.

అదానీ గ్రూప్‌కు బిలియన్ల డాలర్ల నష్టం

ఈ నోటీసుల వార్త తరువాత, అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 10.65 శాతం పడిపోయి, దాని ధర 1,864.20కి దిగొచ్చింది. మొత్తంమీద, అదానీ గ్రూప్ కంపెనీలు ఈ సెషన్‌లో దాదాపు 12.5 బిలియన్ డాలర్లు నష్టపోయియాయి. మరోవైపు టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలు సాధించాయి.