<p>Train Accident in Srikakulam District | టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు దాటుతున్న ఐదుగురు యువకులను రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో విషాదం నెలకొంది. వీరిలో నలుగురు ప్రాణాలు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. </p>
<p>ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం మృతులు, గాయపడిన వ్యక్తి డమర ప్రాంతానికి చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ రైలు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. <br /></p>