Skoda Kylaq vs Maruti Brezza Comparison: మొత్తం కార్ల ప్రపంచంలో, కాంపాక్ట్ SUV సెగ్మెంట్ మన తెలుగు ప్రజలకు ప్రియమైనది. ప్రతి కంపెనీ ఈ విభాగంలో ఉత్తమ మోడళ్లను విడుదల చేస్తోంది. మారుతి బ్రెజ్జా చాలా కాలంగా ప్రజాదరణ పొందిన కారు, స్కోడా కైలాక్‌కు కూడా బలమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇంజిన్, ఫీచర్లు & ధర పరంగా, ఈ రెండు కార్లలో ఏ SUV బెటర్‌ అన్నది తెలుసుకుందాం.

ఇంజిన్ & మైలేజ్ పోలిక

స్కోడా కైలాక్ 1.0 లీటర్ TSI ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 85 kW పవర్ & 178 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ & DCT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ARAI సర్టిఫై చేసిన ప్రకారం, ఈ కారు మాన్యువల్ వేరియంట్‌లో లీటరుకు 19.68 km & ఆటోమేటిక్‌ వేరియంట్‌లో లీటరుకు 19.05 km మైలేజీ ఇస్తుంది.

మారుతి బ్రెజ్జా 1.5 లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 103.1 PS పవర్ & 136.8 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. ఈ కారుకు 48 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉంది. కంపెనీ లెక్క ప్రకారం, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ SUV లీటరుకు 19.89 కి.మీ. మైలేజీ అందిస్తుంది, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 19.80 కి.మీ. మైలేజీ ఇస్తుంది.

పోటీ ఫీచర్లు

స్కోడా కైలాక్ కారులో, మెరిసే నల్లటి ఫ్రంట్ గ్రిల్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్లు & DRLs, LED టెయిల్‌లైట్లు, డ్రైవర్ & కో-డ్రైవర్ కోసం 6-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టల్‌ సీట్లు & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 20.32 cm డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ & 25.6 cm ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

మారుతి బ్రెజ్జా కూడా ఫీచర్ల పరంగా ఏ మాత్రం వెనుకబడలేదు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, వెనుక AC వెంట్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు & గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లతో ఏ కారుది పైచేయి?

స్కోడా కైలాక్ 25 కు పైగా యాక్టివ్ & పాసివ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. వీటిలో - ఆరు ఎయిర్‌బ్యాగులు, ESC, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, మల్టీ-కొలిషన్ బ్రేకింగ్ & బ్రేక్ డిస్క్ వైపింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

మారుతి బ్రెజ్జా ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగులు, రియర్-వ్యూ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హై-స్పీడ్ అలర్ట్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ISOFIX చైల్డ్ యాంకరేజ్, సెంట్రల్ లాకింగ్ & రియర్ డీఫాగర్ వంటి ఫీచర్లు అందిస్తుంది.

ధరల్లో తేడా (తెలుగు రాష్ట్రాల్లో)

స్కోడా కైలాక్ కారు టాప్ వేరియంట్ ధర ₹7.55 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై ₹12.80 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మారుతి బ్రెజ్జా కారు టాప్ వేరియంట్ ధర ₹8.26 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై ₹13.01 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఏ కారు కొనడం మంచిది?

మీరు ఎక్కువ పవర్ & ఫీచర్లతో కూడిన SUV కోసం చూస్తుంటే, స్కోడా కైలాక్ ఒక ప్రీమియం ఎంపిక. అధిక మైలేజ్, హైబ్రిడ్ ఇంజిన్ & మారుతి అందించే ఆఫ్టర్‌ సేల్‌ సర్వీస్‌ కావాలనుకుంటే మారుతి బ్రెజ్జా మంచి ఎంపిక కావచ్చు.