Singareni Gold Copper Exploration : రెండు పొరుగు రాష్ట్రాల ఇంధన ప్రగతికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేసేలా ఒక కీలక అడుగు పడింది. తెలంగాణకు చెందిన ప్రభుత్వం రంగ సంస్థ అయిన సింగరేణి, కర్ణాటక విద్యుత్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో కలిసి పని చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. గురువారం బెంగళూరులో కర్ణాటక ఇంధన మంత్రి కేజే జార్జ్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం ఈ ప్రతిపాదనను అధికారికంగా ముందుకు తెచ్చారు. ఈ చారిత్రాత్మక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, నిరంతర బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ల చెల్లింపులు, సాంకేతికత మార్పిడి వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దక్కించుకున్న కర్ణాటకలోనే రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామ పరిదిలోని బంగారం, రాగి ఖనిజాల సర్వే పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే స్థానిక నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా, ఈ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సింగరేణి-కేపీసీఎల్ జాయింట్ వెంచర్‌

బెంగళూరులో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి సంస్థకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని ప్రస్తావించారు. బొగ్గు మైనింగ్ రంగంలో సింగరేణికి ఉన్న 137 ఏళ్ల అపారమైన అనుభవం, నైపుణ్యం దేశంలోనే అగ్రగామిగా నిలిపాయని ఆయన గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో కర్ణాటక పవర్ కార్పొరేటషన్ లిమిటెడ్ దక్కించుకున్న క్యాప్టివ్ కోల్ బ్లాకుల్లో మైనింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టేందుకు ఈ అనుభవం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. అందువల్ల ఈ కోల్ బ్లాక్‌లలో మైనింగ్ జరిపేందుకు సింగరేణి, కేపీసీఎల్‌ సంస్థలు జాయింట్ వెంచర్‌గా కలిసి పని చేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని భట్టి ప్రతిపాదించారు.

దీనికి ప్రతిగా, పవర్ ప్లాంట్‌ల నిర్వహణలో కర్ణాటక రాష్ట్రానికి ఉన్న విద్యుత్ అనువాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని సింగరేణి పవర్ ప్లాంట్‌ల నిర్వహణలో వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ఉమ్మడి సహకారంపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సంయుక్తంగా అధ్యయనం చేయాలని ప్రతిపాదించారు.

సానుకూలంగా స్పందించిన కర్ణాటక మంత్రి

తెలంగాణ డిప్యూటీ సీఎం చేసిన ప్రతిపాదనలై కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో పారిశ్రామిక ప్రగతి వేగంగా జరుగుతోందని దీనికి విద్యుత్ అవసరం అవుతుందని అన్నారు. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి కర్ణాటకలోని ప్లాంట్లకు తెలంగాణ నిరంతరం బొగ్గు సరఫరా చేయాలని కోరారు.

దీనికి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ణాటకకు బొగ్గు సరఫరా నిరంతరాయం కొనసాగిస్తామని అన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ నుంచి కర్ణాటకలోని ఎర్రమారస్, రాయచూర్, బళ్లారి థర్మల్ ప్లాంట్లకు ఏడాదికి ఏకంగా 10.54 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

దేవదుర్గ గనుల్లో బంగారం, రాగి నిక్షేపాల అన్వేషణ ప్రారంభం

బెంగళూరు పర్యటన అనంతరం భట్టి విక్రమార్క నేరుగా రాయచూరుజిల్లా దేవ దుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామానికి చేరుకున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టనున్న రాగి, బంగారు ఖనిజాల అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ టెండర్లలో దేవదుర్గ బ్లాక్ ఎక్స్‌ప్లోరేషన్ హక్కులను సింగరేణి సంస్థ విజయవంతంగా దక్కించుకుందని ఆయన గుర్తు చేశారు.

పనులను ప్రారంభించిన తర్వాత భట్టి విక్రమార్క క్షేత్రస్థాయికి వెళ్లి దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూపాయింట్‌ నుంచి అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను పరిశీలించారు. రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థ ఇక్కడ అన్వేషణ పనులను మరింత వేగంగా చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసి దేశ సంపదను పెంపొందించడానికి తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాలు కలిసి కట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.