<p>RGIA Airport | శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్ పోర్ట్)లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సింగపూర్ నుండి శంషాబాద్‌కు వస్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SQ 518) విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని దుండగులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.</p>
<p>విమానం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, అధికారులు వెంటనే దానిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబు స్క్వాడ్, సెక్యూరిటీ సిబ్బంది విమానంలోని ప్రతి భాగాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. అయితే భద్రతా కారణాలతో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.</p>
<p>గత కొన్ని నెలలుగా దేశంలోని వివిధ విమానయాన సంస్థలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపు మెయిళ్ళు (Hoax Calls/Emails) రావడం పెరిగిపోయింది. విమానయాన సంస్థలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఇటువంటి మెయిళ్ళు పంపే వారిని గుర్తించి, వారిని నో-ఫ్లై లిస్ట్ లో చేర్చడంతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.</p>