Sanju Samson Smashes Historic Century for CSK Against MI: ఐపీఎల్ లో ‘ఎల్ క్లాసికో’గా పిలిచే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) పోరులో సంజు శామ్సన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గురువారం వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో శామ్సన్ కేవలం 54 బంతుల్లో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిఎస్‌కే జెర్సీలో ఆడుతున్న ఏడవ మ్యాచ్‌లోనే శామ్సన్ కు ఇది రెండవ సెంచరీ కావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై ఐపీఎల్ లో సెంచరీ చేసిన మొదటి చెన్నై బ్యాటర్‌గా శామ్సన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో 2018 సీజన్ లో షేన్ వాట్సన్ ఒకే సీజన్ లో రెండు సెంచరీలు చేయగా, ఇప్పుడు శామ్సన్ ఆ ఘనతను సమం చేశాడు.

ఒంటరి పోరాటం..
టాస్ గెలిచిన ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, శామ్సన్ మాత్రం ఏమాత్రం తలవొగ్గలేదు. ఒకవైపు సహచర బ్యాటర్లు పేలవమైన షాట్లతో వెనుదిరుగుతున్నా, భారత వికెట్ కీపర్ బ్యాటర్ శామ్సన్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుస ఫోర్లు బాదడమే కాకుండా, ఒక అద్భుతమైన సిక్సర్‌తో తన జోరును చాటాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22) ఆరంభంలో మెరిసినా, అల్లా గజన్‌ఫర్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

Entertaining 🍿💛

Describe his knock in one word 👇

Relive his knock ▶️ https://t.co/Bfan9rmvpv #TATAIPL | #KhelBindaas | #MIvCSK | @IamSanjuSamson | @ChennaiIPL pic.twitter.com/oNDiHQ9AkL

— IndianPremierLeague (@IPL) April 23, 2026

తడబడిన మిడిల్ ఆర్డర్..
డొమెస్టిక్ క్రికెట్ లో ముంబైకి ఆడే ఆటగాళ్లయిన సర్ఫరాజ్ ఖాన్ (14), శివమ్ దూబే (5) సొంత గడ్డపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మిచెల్ సాంట్నర్ వేసిన బంతిని స్వీప్ చేయబోయి సర్ఫరాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దిట్ట అయిన శివమ్ దూబే కూడా గజన్‌ఫర్ వేసిన అద్భుతమైన బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ 21 పరుగులు చేసి ఆశలు రేపినా అశ్విని కుమార్ వేసిన షార్ట్ బంతికి అవుటయ్యాడు. ఒక దశలో భారీ స్కోరు సాధించేలా కనిపించిన చెన్నై, మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

చివరి ఓవర్లో సెంచరీ సంబరం..
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో శామ్సన్ తన అనుభవాన్నంతా ఉపయోగించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జాగ్రత్తగా ఆడుతూనే లూజ్ బంతులను బౌండరీలకు తరలించాడు. చివరి ఓవర్లో కృష్ భగత్ బౌలింగ్‌లో ఒక భారీ సిక్సర్ బాదిన శామ్సన్, ఆఖరి బంతికి ఫోర్ కొట్టి తన ఐపీఎల్ కెరీర్‌లో 6వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీనితో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ రెండు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు.

మరోవైపు, చెన్నై ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో నల్లటి రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగారు. ఇటీవల మరణించిన సహచర ఆటగాడు ముఖేష్ చౌదరి తల్లికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శామ్సన్ సాధించిన ఈ 101 పరుగుల స్కోరు, ముంబైపై ఒక సీఎస్‌కే బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. గతంలో 2021లో రుతురాజ్ గైక్వాడ్ చేసిన 88 పరుగుల రికార్డును శామ్సన్ అధిగమించాడు.