విజయవాడ: కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఏ4 (A4) నిందితుడిగా ఉన్న గులివిందల సురేష్ ఇంకా పరారీలో ఉండటంతో, అతడి ఆచూకీ తెలపాలంటూ అధికారులు గుర్తింపు వివరాలతో కూడిన ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఆదినారాయణ కుమారుడైన 40 ఏళ్ల సురేష్, సుమారు 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటాడంటూ అతడి వివరాలు సిట్ అధికారులు వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తి అయినప్పటికీ మాజీ సీఐ నాగరాజుకు సన్నిహితుడు కావడంతో కృష్ణలంక పీఎస్‌లో పెత్తనం చేసేవాడని, సాయికృష్ణ కేసులో అతడికి చాలా విషయాలు తెలుసుని సిట్ భావిస్తోంది.

సాయికృష్ణ మృతి, లాకప్ డెత్ కేసు నమోదైనప్పటి నుంచి నిందితుడు సురేష్ అరెస్టు నుంచి తప్పించుకుంటూ పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఏ4 నిందితుడ్ని పట్టుకునేందుకు సిట్ చర్యలు చేపట్టింది. మొదట్లో ఇతడిపై కేసు నమోదు కాకపోవడంతో పోలీసుల విచారణకు హాజరయ్యాడు. ఆ తరువాత సురేష్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నాడని, అతడి హస్తం ఉందని గుర్తించి కేసులో పేరు చేర్చిన తరువాత అదృశ్యమయ్యాడు.

నిందితుడు సురేష్ ఆచూకీ, సంచరిస్తున్న ప్రాంతాలు లేదా తలదాచుకున్న చోటుకు సంబంధించి ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు అందించాలని అధికారులు ప్రజలను కోరారు. చిన్న ఆధారమైనా నిందితుడి అరెస్టులో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Also Read: Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

నిందితుడికి షెల్టర్ ఇస్తే నేరస్తులు అవుతారు..

పరారీలో ఉన్న నిందితుడికి తెలిసి ఆశ్రయం కల్పించడం లేదా దాచిపెట్టడం చట్టపరంగా తీవ్రమైన నేరమని, అటువంటి వారికి శిక్షలు తప్పవని సిట్ హెచ్చరించింది. సమాచారం తెలిసిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోగానీ, లేదా అత్యవసర సేవల నంబర్లు 100/112 కు గానీ కాల్ చేసి వివరాలు తెలియజేయవచ్చని స్పష్టం చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.