Sahara India Refund News Update: ఏళ్ల తరబడి బాధ పడిన సహారా ఇండియా బాధితులకు క్రమంగా వాళ్ల డబ్బు తిరిగి వస్తోంది. సహారా గ్రూప్ సహకార సంఘాల్లో డబ్బులు డిపాజిట్‌ చేసిన 11,61,077 మందికి, 2025 జనవరి 28 వరకు, మొత్తం రూ. 2,025.75 కోట్లు తిరిగి చెల్లించినట్లు కేంద్ర హోం & సహకార శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మంగళవారం లోక్‌సభ (Lok Ssbha)కు తెలిపారు.

అమిత్ షా లోక్‌సభలో ఇంకా ఏం చెప్పారు?
సహారా గ్రూప్ సహకార సంఘాలకు చెందిన బాధిత డిపాజిటర్లకు చెల్లింపులు "సీఆర్‌సీఎస్‌-సహారా రీఫండ్ పోర్టల్‌" (CRCS-Sahara Refund Portal) ద్వారా జరుగుతుందని, మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరుగుతుందని అమిత్‌ షా లోక్‌సభకు తెలిపారు. దీనిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు, అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ సాయం చేస్తున్నారని వివరించారు. సరైన గుర్తింపు పత్రం & డిపాజిట్ చేసిన మొత్తానికి రుజువుల ఆధారంగా అన్ని దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలిస్తున్నామని అమిత్‌ షా వెల్లడించారు. ప్రస్తుతం, అర్హత కలిగిన ప్రతి డిపాజిటర్‌కు, వారి ఆధార్‌కు లింక్ అయిన బ్యాంకు ఖాతాలో గరిష్టంగా రూ. 50,000 జమ అవుతోంది.

కొత్త సమాచారం ఏంటి?
CRCS-సహారా రీఫండ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పెట్టుబడిదారులు రూ. 5,00,000 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే, సహారా ఇండియా సహకార సంఘాల్లో చిక్కుకుపోయిన రూ. 5 లక్షల వరకు డబ్బు వాపసు కోసం పెట్టుబడిదార్లు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 5 లక్షలకు పైగా మొత్తాల కోసం దరఖాస్తు తేదీని తరువాత ప్రకటిస్తారు. 29 మార్చి 2023 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, సహారా గ్రూప్‌లోని నాలుగు సహకార సంఘాల డిపాజిటర్లకు డబ్బు వాపసు ఇవ్వడానికి సీఆర్‌సీఎస్‌-సహారా రీఫండ్ పోర్టల్‌ను సృష్టించారు. ఆ నాలుగు సహకార సొసైటీలు:

1. హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతా
2. సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లఖ్‌నవూ
3. సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, భోపాల్
4. స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్

క్లెయిమ్‌ చేయడానికి ఈ పత్రాలు అవసరం
ఒక పెట్టుబడిదారు రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని క్లెయిమ్ చేస్తుంటే, అతను తప్పనిసరిగా తన పాన్ కార్డ్‌ వివరాలను ఇవ్వాలి. ఇది కాకుండా, ఈ రూల్స్‌ కూడా పాటించాలి.

పెట్టుబడిదారు, తన మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి.
బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి.
సహారా కమిటీలలో జమ చేసిన మొత్తాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి.

ఎలా క్లెయిమ్ చేయాలి?
ముందుగా CRCS-సహారా రీఫండ్ పోర్టల్‌లోకి వెళ్లండి. మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఉపయోగించి పేరు నమోదు (Registration In CRCS-Sahara Refund Portal) చేసుకోండి. మీ డిపాజిట్ల సమాచారాన్ని పూరించండి. పాన్ కార్డ్ (డిపాజిట్ల మొత్తం రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే) & ఇతర అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు సమర్పించిన తర్వాత, 45 రోజుల్లోపు మీ రిఫండ్‌ మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది.

మరో ఆసక్తికర కథనం:  చుక్కలు చూపిస్తున్న పుత్తడి ధర, ఇక కొనలేం -ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ