Ryan Rickelton Smashes Fastest IPL Century for Mumbai Indians: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ (MI) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ చరిత్ర సృష్టించాడు. గత కొన్ని మ్యాచ్‌లలో వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అవ్వడంతో జట్టుకు దూరమైన రికెల్టన్, దాదాపు రెండు వారాల తర్వాత మళ్ళీ తుది జట్టులోకి వచ్చాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా వాడుకున్న ఈ 29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్, వాంఖడే స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించి ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

రికార్డుల వేటలో రికెల్టన్..

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి రికెల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 55 బంతుల్లోనే 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కేవలం 44 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకోవడం ద్వారా 2008లో సనత్ జయసూర్య (45 బంతుల్లో సెంచరీ) పేరిట ఉన్న రికార్డును రికెల్టన్ అధిగమించాడు. అంతేకాకుండా, ముంబై తరపున ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా జయసూర్య (114 నాటౌట్) రికార్డును తుడిచిపెట్టేశాడు. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాల స్కోర్లను దాటి రికెల్టన్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు.

Also Read: డ్రెస్సింగ్ రూంలో ఈ సిగరెట్ తాగిన రియాన్ పరాగ్, BCCI ఏ చర్యలు తీసుకుంటుంది!

విధ్వంసకర ఇన్నింగ్స్..

కొత్త ఓపెనింగ్ పార్ట్నర్ విల్ జాక్స్ (46) తో కలిసి రికెల్టన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ఈ జోడి 78 పరుగులు పిండుకుంది. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రికెల్టన్, ఆ తర్వాత మరింత వేగంగా ఆడి మరో 21 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఒకవైపు విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (5), నమన్ ధీర్ (22) అవుట్ అయినా, రికెల్టన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31) కూడా చివర్లో మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Also Read: సెల్ఫీకి రూ. 100 వసూలు చేస్తున్న వైభవ్ సూర్యవంశీ! వైరల్ అవుతున్న వీడియో!

సూర్యకుమార్ నిరాశ - ముంబై సంతాపం..

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ ఫామ్ అందుకోవడంలో తడబడ్డాడు. ఈషన్ మలింగ వేసిన షార్ట్ బంతిని పుల్ చేయబోయి ఫైన్ లెగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో నల్లటి రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగారు. ముంబై సపోర్ట్ స్టాఫ్ లో ఒకరి కుమార్తె అకాల మరణం చెందడంతో ఆమెకు నివాళిగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో రికెల్టన్ తన షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు.

గతంలో ఎస్ఏ20 (SA20) లో కూడా ముంబై కేప్ టౌన్ తరపున రెండు సెంచరీలు చేసిన రికెల్టన్, ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా తన సత్తా చాటుకున్నాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై భారీ టార్గెట్ ను సెట్ చేయడంతో ఇప్పుడు బంతి సన్‌రైజర్స్ కోర్టులో ఉంది. రికెల్టన్ విధ్వంసం ముంబై టీమ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.