జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై గెలుపొందారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి రచించిన బహుముఖ వ్యూహం ఫలించింది. ఈ విజయం వెనుక సీఎం రేవంత్ వ్యూహాలు ఏంటి అన్న అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

1. గెలుపు కోసం సోషల్ ఇంజనీరింగ్

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక గెలుపులో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం ఫలించింది. ఈ నియోజకవర్గంలో కీలక ఓటర్లయిన యాదవ, ముస్లిం ఓటర్ల ఏకీకరణకు ప్రయత్నించారు. ఇందుకోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికల బరిలో లేకుండా చూసుకున్నారు. అంతేకాకుండా, ఎంఐఎం మద్దతుదారులు, ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు, ఎన్నికల ముందు అనూహ్యంగా మైనార్టీ వర్గాన్ని ఆకట్టుకునేందుకు క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో మైనార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, సీఎం రేవంత్ రెడ్డి పట్ల విశ్వాసం పెరిగింది. అది ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడుతోంది. వీరితో పాటు యాదవ ఓటర్లను ఆకట్టుకునేందుకు, గెలుపు గుర్రంగా నవీన్ యాదవ్ను సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థిగా నిలబెట్టారు. దీంతో యాదవ్ - మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ గెలుపుకు దోహదపడ్డాయి.

2. సంక్షేమ పథకాలు - బస్తీ ఓటర్ల సమీకరణ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ సానుభూతి అస్త్రం ప్రయోగించడంతో దాన్ని నిర్వీర్యం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు, బస్తీల్లో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. యూసఫ్‌గూడ, రహమత్‌నగర్ వంటి బస్తీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పథకంతో పాటు ఇతర సంక్షేమ పథకాల హామీలు పని చేశాయి. సానుభూతి కంటే 'చేయూత ఇచ్చే ప్రభుత్వం మాది' అన్న భావనను కాంగ్రెస్ వర్గాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా సీఎం వ్యూహాలు రచించారు. అది ఈ ఉపఎన్నికల్లో ఫలితాలనిచ్చింది. ఆయా వర్గాలతో సమావేశమై వారి సమస్యల పరిష్కారం కోసం హామీలు ఇవ్వడం, కోరిన రీతిలో 250 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం కూడా అధికార కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది.

3. సీఎం కార్నర్ మీటింగ్‌లు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో రెండు మూడు కార్నర్ మీటింగ్‌లతో సరిపెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ అప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల బలంగా ఉందన్న సమాచారం మేరకు సీఎం తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఏడు డివిజన్లలో కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. కేవలం 'ప్రచారం' అన్న రీతిలో కాకుండా, నియోజకవర్గ ఓటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడేలా కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. సీఎం తన పాలన కోసం వ్యక్తిగతంగా వివరించే ప్రయత్నం చేశారు. సంక్షేమ హామీలపైన తన అభిప్రాయాలను నేరుగా వెల్లడించడం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది.

4. పోల్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్ అయిన కాంగ్రెస్

గతంలో బలహీనమైన పోల్ మేనేజ్‌మెంట్ చేసే పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్‌కు పేరు. కానీ గత శాసన సభ ఎన్నికల నాటి నుండి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పోల్ మేనేజ్‌మెంట్ చేయడం గమనార్హం. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో సీఏం మైక్రో మేనేజ్‌మెంట్ వ్యూహాన్ని అమలు చేశారు. ప్రతీ డివిజన్‌కు ఒక్కో సీనియర్ మంత్రిని ఇన్‌చార్జులుగా నియమించారు. కీలక నేతలందరూ డివిజన్ల వారీగా బాధ్యతలు చేపట్టేలా వ్యూహాలు రచించి అమలు చేశారు. మంత్రులుగా ఉన్న ఇన్‌చార్జులు, కీలక నేతలు స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటర్ల జాబితాను పరిశీలించడం, బూత్ లెవెల్‌లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం వంటి పనులను చక్కగా చేపట్టారు. ఇది బీఆర్ఎస్ కంటే ఎక్కువ శాతం ఓటింగ్ కాంగ్రెస్‌కు వచ్చేలా చేయడంలో కీలకంగా పని చేసింది. ఈ కారణంగానే 24 వేల మెజార్టీని సాధించడానికి ఉపయోగపడినట్లు కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ దఫా చేసిన పోల్ మేనేజ్‌మెంట్ గతంలో కన్నా చక్కగా చేసినట్లు నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.