Rent Agreement Rules 2025: దేశంలో చాలా మంది అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఉద్యోగం కారణంగా నగరం మారవలసి వచ్చినా లేదా చదువు కోసం వేరే నగరానికి వెళ్లవలసి వచ్చినా, అద్దెకు ఉండటం లక్షల మందికి అనివార్యంగా మారుతుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, ఇతర పెద్ద నగరాల్లో ఇల్లు కొనడం చాలా మందికి కష్టమవుతుంది. అందుకే అద్దె వారికి ఆసరాగా నిలుస్తుంది. అయితే, ఈ క్రమంలో చాలా కాలంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంటి యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు.

అకస్మాత్తుగా అద్దె పెంచడం, ఎక్కువ సెక్యూరిటీ డిపాజిట్లను డిమాండ్ చేయడం, కారణం లేకుండా ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అద్దె ఒప్పంద నిబంధనలు 2025ని రూపొందించింది. ఈ నిబంధనల లక్ష్యం అద్దెదారులకు బలమైన భద్రతను కల్పించడం, ఇంటి యజమానుల ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని అరికట్టడం. పూర్తి సమాచారం కోసం చదవండి.

అద్దె ఒప్పంద నిబంధనలు 2025 అంటే ఏమిటి?

ప్రభుత్వం కొత్త నిబంధన ఇంటి యజమాని ,అద్దెదారుల మధ్య సమతుల్యతను తీసుకురావడంపై దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఇంటి యజమాని అద్దె పెంచడానికి ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరించాలి. వారు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అద్దెను పెంచవచ్చు. అది కూడా 12 నెలలు పూర్తయిన తర్వాత. దీని కోసం 90 రోజుల ముందు లిఖితపూర్వక నోటీసు ఇవ్వడం తప్పనిసరి. తద్వారా అద్దెదారుకు తగినంత సమయం లభిస్తుంది. ఇంట్లో ఏదైనా మరమ్మత్తు చేయవలసి వస్తే, దానిని చేయించే బాధ్యత ఇంటి యజమానిదే.

ఒకవేళ వారు 30 రోజుల్లో మరమ్మతులు చేయకపోతే, అద్దెదారుడు స్వయంగా మరమ్మతులు చేయించుకోవచ్చు. ఖర్చును అద్దె నుంచి తగ్గించుకోవచ్చు. దీనితో పాటు, కొత్త నిబంధన ప్రకారం సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంప్, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అద్దె ఒప్పందాన్ని అందించడం అవసరం, తద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉంటాయి.

ఇంటి యజమాని ఇష్టం చెల్లదు

అద్దె ఒప్పంద నిబంధనలు 2025 ప్రకారం, ఇంటి యజమాని రెండు నెలలకు మించి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోకూడదు. వాణిజ్య అద్దె విషయంలో ఈ పరిమితి ఆరు నెలలుగా నిర్ణయించింది. ఎవరైనా నమోదు చేసుకోకపోతే, రాష్ట్రాలను బట్టి ఐదు వేల రూపాయల నుంచి జరిమానా విధించవచ్చు. అద్దెదారు గదిలోకి ప్రవేశించే ముందు, ఇంటి యజమాని కనీసం ఇరవై నాలుగు గంటల ముందు లిఖితపూర్వక సమాచారం ఇవ్వాలి.