అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ రెండింటిలో ఏది గెలిచినా రెండవసారి ఛాంపియన్ అవుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మారింది. ఈ స్టేడియం హై-స్కోరింగ్ మ్యాచ్‌లు నమోదు చేస్తుంది.

ఫస్ట్ బ్యాటింగ్ 10 సార్లు, ఛేజింగ్ టీం 8 సార్లు విజేత

టాస్ నెగ్గిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఫీల్డింగ్ ఎంచుకుని గుజరాత్ టైటాన్స్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 10 సార్లు విజేతగా నిలవగా, ఛేజింగ్ చేసిన జట్లు 8 సార్లు టైటిల్ సాధించాయి. మరోవైపు క్వాలిఫయర్ ఫార్మాట్ మొదలుపెట్టిన 2018 నుంచి క్వాలిఫయర్ 1లో నెగ్గిన జట్టే ఈ సీజన్ ఐపీఎల్ విజేతగా నిలుస్తుంది. ఈ రికార్డును తిరగరాయాలని గుజరాత్ టైటాన్స్ ఉవ్విళ్లూరుతోంది.

బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వీళ్లు ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలరు. మరోవైపు గుజరాత్ జట్టులో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, కగిసో రబాడా లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హైస్కోరింగ్ ఆశిస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ స్టేడియంలో రికార్డులు ఏం చెబుతున్నాయి? మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఛేజింగ్ చేసే జట్టును కష్టాల్లోకి నెట్టడానికి ఎంత స్కోర్ చేయాలి ఇక్కడ తెలుసుకోండి.

ఎన్ని పరుగులు చేస్తే ఛేజ్ చేయవచ్చు..

ఐపీఎల్ చరిత్రలో నరేంద్ర మోదీ స్టేడియంలో అత్యధిక స్కోరు 243 పరుగులు, ఇక్కడ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. అహ్మదాబాద్‌లో అత్యధిక రన్ ఛేజింగ్ రికార్డు కోల్‌కతా నైట్ రైడర్స్ పేరు మీద ఉంది. 2023లో గుజరాత్ టైటాన్స్‌పై 205 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ జట్టు విజయవంతంగా ఛేజ్ చేసింది.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు నాలుగుసార్లు ఛేజ్ చేశారు. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు 200 పరుగుల స్కోరు కూడా సేఫ్ కాదని, ఛేజ్ చేయవచ్చు అని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ మ్యాచ్ నెగ్గాలంటే కనీసం 220 పరుగులు, గరిష్టంగా అయితే 250 పరుగులు చేయాలని పాత రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

RCB, GT రికార్డులు..

బెంగళూరు జట్టు కూడా అహ్మదాబాద్‌లో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో RCB హెడ్ టు హెడ్ రికార్డుల పరంగా గుజరాత్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఇరు జట్ల మధ్య ఈ స్టేడియంలో జరిగిన 9 మ్యాచ్‌లలో బెంగళూరు 5 సార్లు గుజరాత్‌ను ఓడించింది. గుజరాత్ ఇక్కడ 200 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేజ్ చేసింది.