Ratha Saptami Signficance: భగవంతుడు లేడు అని నమ్మేవారున్నారు కానీ వెలుగు లేదు, వెలుగుకి కారణం అయిన సూర్యభగవానుడు లేడు అని ఎవ్వరూ వాదించలేరు. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తారు. భూమ్మీద ఉండే జీవుల పుట్టుకకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి మూలం సూర్యుడు. ఆదిత్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన తర్వాత రెండు పర్వదినాలు జరుపుకుంటారు. అందులో మొదటిది మకర సంక్రాంతి అయితే..రెండోది సూర్య జన్మతిథి అయిన రథసప్తమి. ఈ సంవత్సరం 2026 రథసప్తమి జనవరి 25 ఆదివారం వచ్చింది.

సూర్యుడి నుంచి ఏం నేర్చుకోవాలి?

సూర్యుడు తన సమయాన్ని ఎప్పుడూ అతిక్రమించడు..ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధి నిర్వహణలోనే ఉంటాడు

సృష్టిలో ఉండే సంపదకు, ఆహారానికి మూలం సూర్యుడే. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర అందించింది సూర్యుడు. సత్రాజిత్తు అనే రాజుకి శ్యమంతకమణి ప్రసాదించింది సూర్యుడు

వికాసానికి, విద్యలకు, బుద్ధివికాసానికి మూలం వెలుగే..ఆ వెలుగుకి మూలం సూర్యుడు. శరీరంలో 24 తత్వాలను సూర్యకాంతితో మేల్కొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని బోధించారు మహర్షులు

పంచభూతాల్లో భాగం ఆకాశం, అగ్ని... ఆకాశం వల్ల శబ్ధం, అగ్ని వల్ల వెలుగు పుడుతుంది. శరీరంలో ఆరు చక్రాలను పైనుంచి కిందవరకూ చైతన్యపరుస్తుంది. శబ్దం కింద నుంచి పైకి చైతన్యపరుస్తుంది

సూర్య నమస్కారాలు, సూర్యుడి ఆసనాలతో నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తులు అనూహ్యమైన పరివర్తన కలుగుతుంది

ప్రత్యక్షనారాయణుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తీరడంతో పాటూ ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తుంది

రథసప్తమి పూజా విధానం

సూర్యజయంతిగా జరుపుకునే ఈ పండుగ రోజు సూర్యారాధన చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు పెరుగుతుందని.. వంశ వృద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం

వేకువజామునే స్నానం ఆచరించాలి ( జిల్లేడు 7 ఆకులు, 7 రేగుపళ్లు తలపై పెట్టుకుని స్నానం చేయాలి). ఇవి శరీరంలో దోషాలు తొలగిస్తుందని నమ్మకం

స్నానం చేసేటప్పుడు చదవాల్సిన మంత్రం - "ఓం సప్త సప్తి వాహాయ సూర్యాయ నమః"

రథసప్తమి పూజా సామగ్రి

సూర్య భగవానుడి ఫొటో, అక్షతలు, పసుపు కుంకుమ, దీపం, ధూపం, చిక్కుడు కాయలు (రథం కోసం), బెల్లం, పాలు, పండ్లు, పరమాన్నం

చిక్కుడు కాయలతో రథం తయారు చేయాలి ( కాయలు ఒకదానికొకటి తరగకుండా రథం ఆకారంలో అమర్చాలి).. ఈ రథం ముందు సూర్యుడి ఫొటో ఉంచి పూజించాలి

తూర్పుదిక్కుగా సూర్యుడి ఫొటో ఉంచి షోడసోపచార పూజ చేయాలి, నీళ్లలో పసుపు కుంకుమ వేసి సూర్యుడికి సమర్పించాలి.

ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః , ఓం ఆదిత్యాయ నమః అని పఠించాలి

ఆవుపాలు, బెల్లంతో పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించాలి

గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు వస్త్రాలు, ఇత్తడి పాత్రలు దానం చేయడం శుభకరం.

సూర్యుడి పూజ చేసిన రోజు తరిగిన కూర తినకూడదు...చిక్కుడు కాయలు తప్పనిసరిగా తినాలి

సూర్యుడి పూజ చేస్తే ఆరోగ్యం, సంపద కలుగుతాయి

సూర్య గాయత్రి మంత్రం
ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.