Akiveedu temple Issue Raghurama: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని ప్రభుత్వ స్థలంలో మతపరమైన కట్టడాల నిర్మాణంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో వ్యక్తిగతంగా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసలు ఏ హోదాలో వాదనలు వినిపిస్తారని ప్రశ్నించడమే కాకుండా, తన పరిధి దాటి ప్రవర్తించవద్దని ఆయనను న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడం సంచలనంగా మారింది.

అకివీడు రామాలయ నిర్మాణ ప్రయత్నాలను నిలువరించాలని పిటిషన్

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ , జస్టిస్ నైనాల జయసూర్య లతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ జయంతి తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గతంలో స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. ప్రభుత్వ స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థనా మందిరాలు నిర్మించకూడదని గుర్తు చేశారు. పిటిషన్ వేసిన మరుసటి రోజే పోలీసుల సహకారంతో పురాతన భవనాన్ని కూల్చివేసి నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిని తక్షణమే నిలువరించాలని కోర్టును కోరారు.

వాదనల్లో జోక్యం చేసుకోబోయిన రఘురామ - హైకోర్టు ధర్మానసం తీవ్ర ఆగ్రహం

మరోవైపు రఘురామకృష్ణం రాజు తరఫున సీనియర్ న్యాయవాది రవి ప్రసాద్ హాజరై, అక్కడ 1930 నుంచే రామాలయం ఉందని, దానికి అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని వాదించే ప్రయత్నం చేశారు. అయితే, రఘురామకృష్ణం రాజు వ్యక్తిగతంగా కోర్టులో వ్యవహరించిన తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని స్పష్టం చేస్తూ, ఆయన వాదనలు వినడానికి తమకు ఎంతమాత్రం సమ్మతం లేదని తేల్చి చెప్పింది. న్యాయమూర్తుల అసహనం చూసిన రఘురామ వెంటనే కోర్టు హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు.

సింగిల్ జడ్జి బెంచ్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన ధర్మాసనం

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానంలో ప్రవర్తించాల్సిన తీరుపై రఘురామకు చురకలు అంటించింది. మీ పరిధి దాటి ప్రవర్తించకండి అంటూ చేసిన హెచ్చరిక కోర్టు హాల్‌ లో చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద విచారణ పెండింగ్‌లో ఉన్నందున, ఇరుపక్షాలు తమ వాదనలను అక్కడే వినిపించాలని ధర్మాసనం సూచించింది. వివాదాస్పద స్థలంలో వాస్తవానికి ఉన్నది గొంతెనమ్మ గుడినా లేక రామాలయమా అనే చారిత్రక , అధికారిక వాస్తవాలను నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. తక్షణమే ఈ అంశంపై విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ ధర్మాసనం ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ముగించింది.