Patancheru Real Estate | హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పటాన్ చెరు లెక్కలే వేరు. ఒకప్పుడు అమ్మో మీరు పటాన్ చెరులో ఉంటున్నారా, సిటీకి మరీ అంతదూరం నుండి వస్తున్నారా అంటూ ఆశ్చర్యపోయేవాళ్లు సైతం ఇప్పుడు పటాన్ చెరు ఇక్కడేగా, ఐటీ కారిడార్ కు పక్కనేగా అంటున్నారు. అంతలా హైదరాబద్ రియల్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ప్రాంతం ఈ పటాన్ చెరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రియల్ వ్యాపారులు పటాన్ చెరును అంతగా పట్టించుకోలేదు. సమీపంలోని బీరంగూడ వంటి ప్రాంతాలంటే లెక్కలేదు. కానీ ఇప్పుడు పరిస్దితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతలా అంటే పటాన్ చెరు చుట్టుప్రక్కల 15 కిలోమీటర్ల వరకూ భూములు, ఇళ్లు కొనాలన్నా, అమ్మాలన్నా రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు కూడా ఏమాత్రం పోటీపడలేవు. ఎనీ సెంటర్ , ఎనీ కాలనీ, ఇక్కడ పెట్టుబడి పెడితే రెండేళ్లలో డబుల్ పక్కా అంటున్నారు స్దానికులు.

అటు ఇంద్రేశం, ఇటు సంగారెడ్డి దాటి జహీరాబాద్ వరకూ రియల్ ఎస్టేట్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. హైవేకు కాస్త దూరంగా ఉంటే వందగజాల స్దలం కనీసం 40 లక్షలు, హైవేకు సమీపంలో ఉంటే కోటి రూపాయలకు పైగా పలుకుతోంది. ఇంటి అద్దెలు సైతం పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ఏడువేలు ఉండే డబుల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె 15 వేలకు చేరిపోయింది. గచ్చిబౌలికి సమీపంలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంద్రేశంలో ఇళ్లు కొనేందుకు ఆశక్తి చూడంతో ఒక్కసారిగా ఇంద్రేశం దశ మారిపోయింది.

ఒకప్పుడు గజం పదివేలంటే ఇక్కడ వామ్మో అనేవారు, ఇప్పుడు 50 వేల నుండి లక్ష రూపాయలకు గజం ధర చేరిపోయింది. రాష్ట్ర విభజన తరువాత బీఆర్ ఎస్ అధికారంలోకి రావడంతో తెలంగాణ రియల్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పరిస్దితులు పూర్తిగా మారిపోయాయి. పటాన్ చెరు నుండి 15కిలోమీటర్ల పరిధిలో ఎటుచూసినా విస్తరిస్తున్న రియల్ రంగం, కొనాలన్నా, అమ్మాలన్నా కోట్లమీద వ్యవహారంలా మారిపోయింది.అంతలా ఎగసిపడ్డ రియల్ ఎస్టేట్ రంగంలో గత రెండేళ్లుగా ఊహించని స్దబ్ధత నెలకొంది. ధరలు తగ్గనప్పటికీ కొనుగోళ్లు, అమ్మకాలు గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ఎక్కడ కుంటలు, చెరువుల పరిధిలో భూములున్నాయో అర్దం కాక, హైడ్రా భయంతో వెనకడుగువేసేవాళ్లు కొందరైతే, ధరలు తగ్గితే పెట్టుబడి పెడదామని సైలెంట్ అయినవాళ్లు మరికొందరు.

పదేళ్లలో ఊహించని మార్పులు..

రియల్ రంగం ఇంతలా అభివృద్ది చెందడంతోపాటు మౌళిక వసతుల విషయంలో గత పదేళ్లలో ఊహించని మార్పులొచ్చాయి. పారిశుద్యం, త్రాగునీరు, వరద ముంపు వంటి దశాబ్దాల నాటి సమస్యలకు అనేక కాలనీలలో శాశ్వత పరిష్కారం దొరికింది. ముత్తంగి, బండ్లగూడ, ఇంద్రేశం వంటి కాలనీలు ఒకప్పుడు ముళ్ల పొదలు, గతుకుల రోడ్లు , మురుగునీటి ఇబ్బందులతో నరకం చూసేవాళ్లు స్దానికులు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఐటి ఉద్యోగులకు బంగారు గనుల్లా, రియల్ పెట్టుబడులకు అడ్డగా మారిపోయాయి ఈ గ్రామాలు.

సీతారామపురం, శ్రీరామ నగర్ కాలనీ, రామేశ్వరం బండ, పోచారం గ్రామాల మధ్య ఒకప్పుడు స్దానికంగా వాగు పొంగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి.కానీ ఇప్పుడు ముంపు సమస్య లేకపోవడంతో రియల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇండిపెండెంట్ ఇళ్లు కొనాలంటే కోటిన్నరకు చేరుకుంది. అద్దెకు ఇళ్లు కావాలంటే డబుల్ బెడ్ రూమ్ అద్దెలు కొన్ని ప్రాంతాల్లో నెలకు 8వేల నుండి 16వేలకు చేరుకుంది.