పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 1, 2025) ప్రారంభం అయ్యాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 14 కొత్త బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. వాటిని పూర్తి మెజారిటీతో ఆమోదించాలని కేంద్రం యోచిస్తోంది. మరోవైపు, దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పునరీక్షణ (SIR) ప్రక్రియతో పాటు ఢిల్లీ ఉగ్రదాడిపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి SIR అంశంపై చర్చకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి.

ఇటీవల చనిపోయిన ఎంపీలతో పాటు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. వరల్డ్ కప్ నెగ్గిన భారత మహిళల జట్టు, అంధుల టీ20 వరల్డ్ కప్ నెగ్గిన మహిళల జట్టును మోదీ అభినందించారు.

పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టనున్న 14 బిల్లులు ఇవే

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుండి డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. ఇందులో మొత్తం 15 సమావేశాలు ఉంటాయి. ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వం పౌర అణు రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడం సహా 14 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో బీమా చట్టం (insurance Act), దీపావళి చట్టం, కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీల మార్కెట్, జాతీయ రహదారులు, ఉన్నత విద్యా కమిషన్, అటామిక్ ఎనర్జీ, GST, జాతీయ భద్రతకు సంబంధించిన సెస్‌ బిల్లులు ఉన్నాయి.

జన విశ్వాస్ (సవరణ) బిల్లు, 2025

దివాలా మరియు దివాలా-బ్యాంక్రప్సీ చట్టం (సవరణ) బిల్లు, 2025

మణిపూర్ వస్తువులు మరియు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు, 2025

రద్దు మరియు సవరణ బిల్లు, 2025

జాతీయ రహదారులు (సవరణ) బిల్లు, 2025

అణు శక్తి బిల్లు, 2025

కార్పొరేట్ చట్టం (సవరణ) బిల్లు, 2025

సెక్యూరిటీల మార్కెట్స్ కోడ్ బిల్లు, 2025

బీమా చట్టం (సవరణ) బిల్లు, 2025

మధ్యవర్తిత్వం మరియు సయోధ్య (సవరణ) బిల్లు, 2025

ఉన్నత విద్యా కమిషన్ బిల్లు, 2025

కేంద్ర ఎక్సైజ్ సుంకం (సవరణ) బిల్లు, 2025

ఆరోగ్య భద్రత మరియు జాతీయ భద్రత సెస్‌ బిల్లు, 2025

సంవత్సరం 2025–26 కోసం మొదటి అనుబంధ గ్రాంట్ల డిమాండ్లు

పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగాలని, ప్రతిష్టంభనను నివారించడానికి ప్రతిపక్షాలతో చర్చించడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఆదివారం (నవంబర్ 30)న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ తరువాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, మేము ప్రతిపక్షాల మాట వినడానికి సిద్ధంగా ఉన్నామని, పార్లమెంట్ అందరిదీ అని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాల వ్యూమాలు

ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్‌వాదీ పార్టీ, DMKతో సహా పలు పార్టీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. కనుక ఈ శీతాకాల సమావేశాలలో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాలున్నాయి.

ముందుగా, దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ, చర్చించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతాయి. అయితే, SIR అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించి, ఓట్లు దొంగిలించారని ప్రతిపక్షాలు కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. SIR పేరుతో వెనుకబడిన, దళితులు, అణగారిన మరియు పేద ఓటర్లను జాబితా నుంచి తొలగించి తమకు నచ్చిన విధంగా ఓటర్ల జాబితాను తయారు చేస్తోందని వారు అంటున్నారు.