TTD Vigilance Officer Satish Kumar suspicious death: తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్ఓ). ఈ ఘటన నవంబర్ 13, 2025న జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్ మీద ఆయన మృతదేహం దొరికింది.

సతీష్ కుమార్ వయసు 45 సంవత్సరాలు. తిరుపతి సమీపంలో నివసించేవారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం 7 గంటల సమయంలో స్థానికులు మృతదేహాన్ని చూశారు. రైలు ఢీకొని చనిపోయినట్లు కనిపించినా, శరీరంపై గాయాలు అసహజంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. తాడిపత్రి పోలీసులు అనుమానాస్పద మరణం కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. కుటుంబ సభ్యులు ఆత్మహత్య కాదని, హత్యే అని చెబుతున్నారు.

పరకామణి చోరీ కేసు 2023 ఏప్రిల్‌లో మొదలైంది. భక్తులు సమర్పించిన బంగారు, నగలు, విదేశీడాలర్లను రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి దొంగిలిస్తూండగా పట్టుకున్నారు. ఆయనపై సతీష్ కుమార్ మొదటి ఫిర్యాదు చేశారు. పెద్ద జీయర్ మఠం గుమస్తా రవి కుమార్ 920 అమెరికన్ డాలర్లు దొంగిలిస్తూ దొరికిపోయారని కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రవికుమార్ తో లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు. దొంగతో రాజీ చేసుకోవడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2025 అక్టోబర్‌లో హైకోర్టు ఆదేశంతో సీఐడీ దర్యాప్తు మొదలైంది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో బృందం విచారణ ప్రారంభించారు.

రవికుమార్ ఆస్తులను కొన్ని టీటీడీ పేరన రిజిస్టర్ చేసి..మిగతా పెద్ద మొత్తంలో ఆస్తులను ఇతర వైసీపీ నేతలు, అప్పటి టీటీడీ అధికారులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. సతీష్ కుమార్‌ను నవంబర్ 6న తిరుపతి పద్మావతి అతిథి గృహంలో విచారించారు. మరోసారి హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. ఆ తర్వాతే ఆయన చనిపోయారు. దీంతో హత్య అనుమానం పెరిగింది. సతీష్ మొబైల్, వాహనం ఇతర విషయాలను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు.