కాశ్మీర్ ఫ్రంటియర్ IG అశోక్ యాదవ్ దేశ భద్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సంవత్సరం LOC, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ వైపు నుండి చొరబాటు ప్రయత్నాలు చాలా తగ్గాయని, అయితే ముప్పు మాత్రం అనేక రెట్లు పెరిగిందన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దుల అవతల లాంచ్ ప్యాడ్‌లు, ఉగ్రవాద శిబిరాలను తిరిగి ప్రారంభించిందని అన్నారు. వైట్ కాలర్ ఉగ్రవాదులను గుర్తించడం ఇప్పుడు అన్ని భద్రతా దళాలకు ఒక పెద్ద సవాలుగా మారింది.

యాక్టివ్ లాంచింగ్ ప్యాడ్‌లపై ఇంటెలిజెన్స్ నిఘా

జమ్మూ కాశ్మీర్‌లోని బడ్గాం జిల్లాలోని హుమామాలో BSF ఫ్రంటియర్ హెడ్‌క్వార్టర్స్‌లో IGP BSF అశోక్ యాదవ్ సోమవారం (డిసెంబర్ 1, 2025) నాడు మాట్లాడుతూ.. “ప్రస్తుతం LOC వద్ద 69 లాంచింగ్ ప్యాడ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి. దాదాపు 100-120 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు అక్కడ ఎదురు చూస్తున్నారు. మా ఇంటెలిజెన్స్ యూనిట్ (G-UNIT) 69 యాక్టివ్ లాంచింగ్ ప్యాడ్‌లపై నిఘా ఉంచింది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నాయి. సరిహద్దు భద్రతా దళం ఫార్వర్డ్ ఏరియాలో చాలా మెరుగైంది. ఆపరేషనల్ అవసరాలను తీర్చడానికి కొత్త టెక్నాలజీ సైతం కొనుగోలు చేసింది. అయితే BSF చొరబాటు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై దృష్టి పెట్టిందని’ వివరించారు.

ఉగ్రవాదులు చొరబాటు కోసం కొత్త మార్గాలు - IGP యాదవ్

IGP అశోక్ యాదవ్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులు చొరబాటు కోసం కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం, పాకిస్తానీ ఉగ్రవాదులకు సంబంధించి ఉమ్మడి నిఘా సమాచారం ఉంది. అయితే అన్ని భారత దళాలు ఆ ప్రాంతంలో బలంగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండి పాక్ నుంచి జరిగే కుట్రలకు సంబంధించిన ప్లాన్ పై నిఘా పెంచాం. BSF ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో చాలా విజయం సాధించింది. అయితే ఆపరేషన్ సింధూర్‌లో సైన్యం వృత్తిపరమైన విధానాన్ని ప్రదర్శించిందని’ అన్నారు.

22 ఆపరేషన్లు నిర్వహించాం..

"మేం (BSF) ఖచ్చితమైన కాల్పులతో శత్రువు పాక్ లోని స్థావరాలను నాశనం చేయడంలో కీలక పాత్ర పోషించాం. ఆపరేషన్ సింధూర్‌లో సరిహద్దు అవతల ఫార్వర్డ్ స్థానాలు, లాంచింగ్ ప్యాడ్‌లను నాశనం చేశాం. అయితే సైన్యంతో కలిసి లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC), లోతట్టు ప్రాంతాల్లో 22 ఆపరేషన్లు నిర్వహించాం. ఇందులో భాగంగా ఎంతోమంది ఉగ్రవాదులను అంతం చేశాం. పలు రకాల ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.

BSF సైన్యం, జమ్మూ కాశ్మీర్‌ పోలీసులతో కలిసి చర్యలు

, BSF ఆర్మీతో కలిసి 2025లో చొరబాటుకు జరిగిన 4 ప్రయత్నాల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చింది. బలగాలు LoC, లోతట్టు ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPFతో కలిసి 22 ఉమ్మడి ఆపరేషన్లు కూడా నిర్వహించింది. ఇందులో ఉత్తర కాశ్మీర్‌లో కొంతమంది ఉగ్రవాదులను హతమార్చింది. AK-47 రైఫిల్స్, MP-5 రైఫిల్స్, పిస్తోల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు, UBGL, UBGL గ్రెనేడ్లు, చైనీస్ గ్రెనేడ్లు, MGL, మందుగుండు సామాగ్రి సహా పెద్ద మొత్తంలో యుద్ధంలో ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

BSF అకాడమీలో డ్రోన్ వార్‌ఫేర్ స్కూల్ ప్రారంభం

BSF ఇటీవల గ్వాలియర్‌లో BSF అకాడమీలో BSF డ్రోన్ వార్‌ఫేర్ స్కూల్‌ ప్రారంభించినట్లు అశోక్ యాదవ్ తెలిపారు. తద్వారా దళాల ఆక్రమణ, రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి వీలవుతుంది. ఈ పాఠశాల భూమి (BHOOMI) చొరవలో భాగంగా అధికారులకు, సైనికులకు డ్రోన్ డిజైన్, వాటిని ఆయుధాలుగా మార్చడం, జామింగ్ సిస్టమ్స్, AI, ఆధునిక యుద్ధ సాంకేతికతలలో శిక్షణ ఇస్తోంది. BSF యుద్ధ సాంకేతికతను బలోపేతం చేయడానికి పెద్ద సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉందని, అధికారులకు అధునాతన యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తోందన్నారు.