Vizag Betting Mafia: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా అమాయక యువతను నిలువునా ముంచుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గోవాను కేంద్రంగా చేసుకుని, దేశవ్యాప్తంగా వేల కోట్లతో నెట్‌వర్క్ నడుపుతున్న ఈ భారీ ముఠా ఆట కట్టించేందుకు విశాఖ పోలీసులు ఏకంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా వరకు వెళ్లి ఆపరేషన్ నిర్వహించారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు జరిగిన ఈ హై-వోల్టేజ్ ఆపరేషన్‌లో ప్రధాన సూత్రధారితో సహా ఏడుగురు సభ్యులు పట్టుబడ్డారు.

గోవా కేంద్రం.. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ ముఠా First Fair Play , Reddy Anna , Exchange666 వంటి పేరుమోసిన బెట్టింగ్ యాప్‌లను విదేశాల నుండి నిర్వహిస్తోంది. గోవా ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను విస్తరించింది. సోషల్ మీడియా, టెలిగ్రామ్ లింకుల ద్వారా యువతను ఆకర్షించి, వేర్వేరు వ్యక్తుల పేర్లతో సేకరించిన బ్యాంక్ ఖాతాల ద్వారా భారీగా నగదు లావాదేవీలు సాగిస్తోంది. ఫ్రాంచైజ్ పద్ధతిలో బెట్టింగ్‌ను విస్తరించడం ఈ ముఠా ప్రత్యేకత.

కోల్‌కతాలో పోలీసుల సినీ ఫక్కీ ఆపరేషన్

నిందితుల మొబైల్ డేటా ఆధారంగా వారు కోల్‌కతాలో ఉన్నట్లు గుర్తించిన సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కె. భవానీ ప్రసాద్ రావు బృందం, వెంటనే అక్కడకు చేరుకుంది. స్థానిక పోలీసుల సహకారంతో రెజెంట్ పార్క్ ప్రాంతంలోని ఒక నివాస గృహంపై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు పఖరాని కరణ్ అలియాస్ గబ్బర్ తో పాటు సరస అగర్వాల్, అరవింద్ విరిడి, కరణ్ సింగ్, సయాద్ అమనత్ హుస్సేన్, అంబుజ్ గోపి, పరస్ అగర్వాల్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను విశాఖ తరలించి కోర్టులో హాజరుపరచగా, వారికి 15 రోజుల రిమాండ్ విధించారు.

భారీగా లభించిన ఆధారాలు

పోలీసుల తనిఖీల్లో నిందితుల వద్ద నుండి పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ పాస్‌బుక్కులు, చెక్ బుక్కులు , పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ డబ్బు ఎక్కడకు మళ్లుతోంది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సామాన్యుల జీవితాలతో చెలగాటమాడే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.