Number Plate Cloning: రోడ్లపై వేగంగా దూసుకెళ్లడమే కాదు, ఫేక్ నెంబర్ ప్లేట్లతో సైతం ట్రాఫిక్ పోలీసులను కొందరు బురిడీ కొట్టిస్తున్నారు. నిరంతరం పెరుగుతున్న నిఘా, ట్రాఫిక్ కెమెరాల రికార్డింగ్‌తో నంబర్ ప్లేట్ క్లోనింగ్ అనే కొత్త ముప్పు వెలుగులోకి వస్తోంది. నంబర్ ప్లేట్ క్లోనింగ్‌లో ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను కాపీ చేసి, దానిని వేరే వాహనం నెంబర్‌ ప్లేట్ తగిలిస్తారు. తద్వారా తప్పు ఒకరు చేస్తే, చలానా మాత్రం ఆ వెహికల్ నెంబర్ అసలైన యజమాని వద్దకు వెళ్తుంది. హైదరాబాద్‌లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు ఈ సమస్యపై వాహనదారుల్లో ఆందోళనను పెంచాయి.

నంబర్ ప్లేట్ క్లోనింగ్ ఎలా సాధ్యం
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను కాపీ చేస్తారని లేదా క్లోన్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసుల విచారణలో ఇటీవల తేలింది. వేరే వెహికల్ నెంబర్ నోట్ చేసి డూప్లికేట్ నంబర్ ప్లేట్‌ను తమ వాహనానికి తగిలించుకుని ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సిటీ రోడ్లపై ఉన్న ట్రాఫిక్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థలు కేవలం నంబర్‌ను మాత్రమే రికార్డ్ చేస్తాయి. కనుక ఒకరు తప్పు చేసినా సరే, ట్రాఫిక్ చలానా మాత్రం ఆ నెంబర్ అసలైన యజమానికి వెళ్తుంది. తాము వెళ్లని ప్రాంతాల నుండి కూడా చలానాలు వస్తున్నాయని పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి.

హైదరాబాద్ క్లోనింగ్ కేసులు
ఒక కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వ్యక్తికి, తాను వెళ్లకపోయినా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నుంచి ట్రాఫిక్ ఉల్లంఘించినట్లు చలానాలు వస్తున్నాయి. విచారణలో ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలో పనిచేసే 26 ఏళ్ల వి. సురేష్ కుమార్ అనే వ్యక్తి తన స్కూటర్ నంబర్‌ ప్లేట్ తొలగించి, నిబంధనలు ఉల్లంఘించినా తప్పించుకోవడానికి వేరే వాహనం నంబర్‌ ప్లేట్ వాడుతున్నట్లు తెలిసింది. అలాగే ఒక మహిళకు ట్రాఫిక్ చలానాలు వచ్చాయి. పోలీసులు సిసిటివి ఫుటేజ్ సాయంతో నిందితుడిని పట్టుకోగా, అతడు తన వాహనం నంబర్‌లో చిన్న మార్పు చేసి నకిలీ ప్లేట్ తయారు చేసినట్లు తేలింది. ఇలాంటి ఫిర్యాదులు ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయని, తమ వాహనం నంబర్ దుర్వినియోగం అవుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు. నివేదికల ప్రకారం, 2025 మొదటి 10 నెలల్లోనే హైదరాబాద్‌లో 36,000 కంటే ఎక్కువ రాంగ్ చలానాలు జారీ అయ్యాయి. అంటే వాహనం ఒకరిదైతే ట్రాఫిక్ చలానా మాత్రం మరొకరికి వెళ్తున్నాయి.

ఫిర్యాదు చేయడం ఇలా
మీకు కూడా అనవసరంగా ట్రాఫిక్ చలానాలు వస్తుంటే, అది నంబర్ ప్లేట్ క్లోనింగ్‌ కారణం కావచ్చు. అలాంటప్పుడు ముందుగా మీ వాహనం ఉన్న ప్రాంతం, వినియోగాన్ని చలానా తేదీ, స్థలంతో చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. మీరు వివరాలు, లొకేషన్ మ్యాచ్ అవ్వకపోయినా, అనుమానం ఉంటే వెంటనే ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి, ఈ-చలానా వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. నకిలీ నెంబర్ ప్లేట్ లేదా మార్చిన నంబర్ ప్లేట్ వాడటం తీవ్రమైన నేరమని, దీనికి శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిసిటివి కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వంటి టెక్నాలజీతో ఇలాంటి ఫేక్ నెంబర్ ప్లేట్, క్లోనింగ్ నెంబర్ ప్లేట్లపై కేసులపై నిఘా ఉంచారు.