దేశంలో యువత విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఆందోళన పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం, 15 నుంచి 29 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు 8.7 కోట్ల మంది భారత యువత చదువు, ఉద్యోగ చేయడం, లేదా ఏదైనా కోర్సులు, శిక్షణ తీసుకోవడం లేదు. ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో దీనిని అతిపెద్ద సవాలుగా నీతి ఆయోగ్ పేర్కొంది. యువత కోసం సబ్సిడీతో కూడిన శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్ కార్యక్రమాల అవసరం ఉందని స్పష్టం చేసింది.

2021 సర్వే గణాంకాల ఆధారంగా నివేదిక

నీతి ఆయోగ్ 'Reimagining Skilling for Viksit Bharat@2047' పేరుతో ఈ నివేదిక విడుదల చేసింది. ఇందులో 8.7 కోట్ల మంది యువతకు సంబంధించిన అంచనాను 2021లో చేసిన నేషనల్ శాంపిల్ సర్వే (NSS) 78వ రౌండ్ గణాంకాల ఆధారంగా రూపొందించారు. ఈ నివేదికలో భారత వర్క్‌ఫోర్స్, లర్నర్స్ 5 ప్రధాన భాగాలుగా విభజించారు. వీటిలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఆమోదిత (ఫార్మల్), ఇన్‌ఫార్మల్ ఉపాధి, విద్య- ఉపాధి లేదా శిక్షణకు దూరంగా ఉన్న NEET (Not in Education, Employment, or Training) యువత, మహిళలు ఉన్నారు.

NEET యువతకు శిక్షణ అవసరం

విద్య, ఉపాధి లేదా శిక్షణలో భాగస్వాములు కాకుండా ఉన్న 15 నుంచి 29 ఏళ్ల యువతను నీతి ఆయోగ్ NEET కేటగిరీలో చేర్చింది. ఇందులో నిరుద్యోగ యువత ఉన్నారు. నివేదిక ప్రకారం, NEET యువతకు ఆదాయం లేకపోవడం, గతంలో చదువు కోసం చేసిన ఖర్చులు వారికి ఆటంకంగా మారాయి. ఇలాంటి యువతకు అందుబాటు ధరల్లో లేదా సబ్సిడీతో కూడిన శిక్షణతో పాటు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని నివేదిక సూచిస్తోంది. వేర్వేరు విభాగాల కోసం పని నేర్చుకోవడంతో పాటు సంపాదించే మార్గాన్ని లింక్ చేయాలని నీతి ఆయోగ్ తెలిపింది.

స్థానిక అవసరాలు, కొత్త రంగాలతో స్కిల్లింగ్ చేయాలి

వర్క్‌ఫోర్స్ , NEET యువత కోసం మిడ్-కెరీర్ రిస్కిల్లింగ్, స్వయం ఉపాధి మార్గాలు మరియు స్థానిక డిమాండ్‌తో పాటు కొత్తగా ఉద్భవిస్తున్న రంగాలకు సంబంధించిన శిక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగానే కాకుండా, తమ సామర్థ్యం ఆధారంగా స్వయంగా ఉపాధిని ప్రారంభించేలా నైపుణ్యాలను అందించాలని నివేదికలో వివరించారు.

అల్పదాయ వర్గాల విద్యార్థులకు సవాలుగా మారిన ఖర్చులు

ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఇప్పటికే కాలేజీ ఫీజులు, అనేక సందర్భాల్లో ట్యూషన్ల ఖర్చులతో ఇబ్బందిపడుతున్నారని నివేదిక తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో సాంప్రదాయ డిగ్రీతో పాటు వేరే ఖరీదైన స్కిల్ కోర్సులు చేయడం వారికి మరింత భారంగా మారుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే కుటుంబానికి ఆర్థికంగా సాయపడటానికి ఏదో ఒక ఉద్యోగం లేదా స్థిరమైన ఆదాయ మార్గాన్ని వెతుక్కుంటారు. కొన్నిసార్లు తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలో చేరతారు. మరికొందరు యువత చదువు పూర్తయ్యాక ఉద్యోగంలోకి అడుగుపెట్టలేక NEET కేటగిరీలోకి వెళ్లిపోతున్నారు.

8.25 శాతం మందికి అర్హతకు తగ్గ ఉద్యోగం

ఉన్నత విద్య, ఉపాధి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ ప్రకారం, కేవలం 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే తమ చదువుకు తగిన ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. ప్రాక్టికల్ విద్య, పరిశ్రమల అవసరాలకు తగ్గ శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగ అర్హత (ఎంప్లాయాబిలిటీ) దెబ్బతింటోందని నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యను అభ్యసించిన యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

7.67 కోట్లకు పైగా ప్రజలకు శిక్షణ

వికసిత్ భారత్@2047 లక్ష్యాన్ని సాధించాలంటే యువతకు నిరంతరం నేర్చుకోవడానికి, సంపాదించడానికి అవకాశాలు కల్పించాలని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ లక్ష్యంలో స్కిల్లింగ్ పాత్ర అత్యంత కీలకం. నీతి ఆయోగ్ ప్రకారం, 2014-15 నుంచి ఇప్పటివరకు 7.67 కోట్లకు పైగా యువత, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో స్కిల్లింగ్‌ను ఉపాధి, స్వయం ఉపాధి, స్థానిక డిమాండ్, కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాలతో అనుసంధానం చేయాలని నివేదిక స్పష్టం చేసింది.