Car and Bike New GST Effect: దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి GST 2.0 అమల్లోకి వచ్చింది, కార్లు & బైక్‌లను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం అందిస్తుంది. పన్ను స్లాబ్‌లు సవరించిన కేంద్ర ప్రభుత్వం, వాటిని 5% & 18% కి పరిమితం చేసింది. అయితే, లగ్జరీ కార్లు & పెద్ద బైక్‌లపై 40% GST ని ఫ్లాట్‌గా విధించారు. ఈ మార్పు ఫలితంగా ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లపై ₹40,000 నుంచి, ప్రీమియం SUVలపై ₹30 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.

దిగొచ్చిన కార్ల ధరలు

GST 2.0 అమలు తర్వాత, చాలా కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గించాయి.

మహీంద్రా వాహనాలపై ₹1.56 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. బొలెరో నియో ఇప్పుడు ₹1.27 లక్షల వరకు చౌకగా ఉంది. XUV 3XO ధర ₹1.40 నుంచి ₹1.56 లక్షల వరకు తగ్గింది. థార్ సిరీస్‌ ధర ₹1.35 లక్షల వరకు దిగి వచ్చింది. స్కార్పియో N ధర ₹1.45 లక్షల తగ్గింపును పొందుతుండగా, XUV700 కొనేవాళ్లకు ఇప్పుడు ₹1.43 లక్షల వరకు ఆదా అవుతుంది.

టాటా మోటార్స్ కూడా తన వాహనాల ధరలను సవరించింది. టియాగో ఇప్పుడు ₹75,000 చౌకగా వస్తోంది. నెక్సాన్ మీద భారీగా ₹1.55 లక్షలు డిస్కౌంట్ లభిస్తోంది. హారియర్ ధర ₹1.40 లక్షలు & సఫారీ ₹1.45 లక్షలు తగ్గాయి.

టయోటా వాహనాలు కూడా గణనీయంగా ప్రభావితమయ్యాయి. ఫార్చ్యూనర్ ధర ₹3.49 లక్షల తగ్గింపును చూసింది. లెజెండర్ ధర ₹3.34 లక్షలు సేవ్‌ చేస్తోంది. హైలక్స్ ₹2.52 లక్షల చౌకగా వస్తుంది & వెల్‌ఫైర్ ధర ₹2.78 లక్షల వరకు దిగి వచ్చింది.

రేంజ్ రోవర్ కూడా అతి భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. రేంజ్ రోవర్ 4.4P SV LWB పై ₹30.4 లక్షల తగ్గింపు లభిస్తోంది. డిఫెండర్ సిరీస్‌ ధర ₹18.6 లక్షల వరకు తగ్గింది. డిస్కవరీ మీద ఇప్పుడు ₹9.9 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు.

కియా వాహనాల్లో - సోనెట్ ధర ₹1.64 లక్షలు తగ్గింది. సెల్టోస్‌పై ₹75,000 వరకు డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నాయి & కార్నివాల్‌పై ₹4.48 లక్షల వరకు ప్రయోజనాలు అందుతాయి.

స్కోడా కార్లలో - కోడియాక్ కొనుగోలుదార్లు ₹3.3 లక్షల GST తగ్గింపును చూడగా, స్లావియా కొనుగోలుదార్లు ₹63,000 వరకు తగ్గింపును చూసింది.

హ్యుందాయ్ వాహనాలకు కూడా కొంత ఉపశమనం లభించింది. వెన్యూ ఇప్పుడు ₹1.23 లక్షల వరకు చౌకగా ఉంది. క్రెటా ₹72,145 తగ్గింపును పొందుతోంది & టక్సన్ ధర ₹2.4 లక్షలు తగ్గించబడింది.

మారుతి కార్లు మరింత బడ్జెట్‌-ఫ్రెండ్లీగా మారాయి. ఆల్టో K10 ₹40,000 చౌకగా ఉంటే; స్విఫ్ట్ ధర ₹58,000, డిజైర్ ధర ₹61,000, బ్రెజ్జా ధర ₹78,000 తగ్గింది. ఫ్రాంక్స్‌ ఇప్పుడు ₹68,000 చౌకగా ఉంది. జిమ్నీ ధర ₹1.14 లక్షలు తగ్గగా, ఇన్విక్టో ధర ₹2.25 లక్షలు దిగి వచ్చింది. నిస్సాన్ మాగ్నైట్ CVT కూడా ₹97,000 నుంచి ₹1 లక్ష వరకు సేవ్‌ చేస్తోంది.

చౌకగా బైక్‌లు

GST 2.0 ద్విచక్ర వాహనాలను కూడా ప్రభావితం చేసింది. భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్లో 98% వాటా 350cc కంటే తక్కువ ఇంజిన్లు కలిగిన బైక్‌లు & స్కూటర్‌లదే. ఈ విభాగంలో ధరలు ₹5,000 నుంచి ₹21,000 వరకు తగ్గాయి.
హోండా టూ-వీలర్స్‌లో - యాక్టివా 110 ధర ₹7,874 తగ్గింది. షైన్ 100 ధర ₹5,672; యునికార్న్ ధర ₹9,948; హార్నెట్ 2.0 ₹13,026; NX200 ₹13,978 మేర ఆదా చేస్తాయి. CB350 H'ness ఇప్పుడు ₹18,598 & CB350RS ₹18,857 వరకు దిగి వచ్చాయి.

హీరో స్ప్లెండర్ & హోండా షైన్ 125 కూడా ₹7,000 నుంచి ₹9,000 వరకు ఆదా చేస్తాయి. బజాజ్ పల్సర్ & TVS అపాచీ వంటి బైక్‌ల ధర ₹8,000 నుంచి ₹15,000 వరకు తగ్గాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనేవాళ్లకు ₹21,000 వరకు ఆదా అవుతోంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎలాంటి మార్పు లేదు

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎలక్ట్రిక్ వాహనాలపై మునుపటి లాగే 5% GST వర్తిస్తుంది. అంటే Ola S1 Pro, Ather 450X, & Tata Tiago EV వంటి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు మారవు. GST 2.0 అమలు.. భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పటివరకు అతి పెద్ద ధర తగ్గింపునకు బాటలు వేసింది. మారుతి సుజుకి వంటి బడ్జెట్ కార్ల నుంచి రేంజ్ రోవర్ వంటి లగ్జరీ SUVలు & హీరో స్ప్లెండర్ వంటి కమ్యూటర్ బైక్‌ల వరకు, మునుపటి కంటే చౌకగా వస్తున్నాయి. ఈ మార్పు ముఖ్యంగా మధ్య తరగతి కస్టమర్లు & మొదటిసారి కొనుగోలు చేసేవారికి చాలా ఉపశమనంగా మారింది.