అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేసవిలో అడవులు ఆకులు నేల రాలి మోడు వారి కనిపిస్తుంది. కానీ ఈ వేసవిలో కొన్ని చెట్లు పచ్చగాను.. మరి కొన్ని చెట్లు ఎరుపు రంగు వర్ణంలో కనిపిస్తుంటాయి. అందులో ఒకటి ఇప్ప చెట్టు. ఈ ఏప్రిల్ నెలలో ఇప్ప చెట్టు పూత దశలో ఉంటుంది. ఇప్ప పువ్వు నేల రాలుతుంది. ఈ ఇప్ప చెట్లు ఎక్కువగా ఆదిలాబాద్ అడవుల్లోనే ఉన్నాయి. ఈ ప్రకృతి ఒడిలో అందరిని ఆకట్టుకునేలా ఓ ఇప్ప చెట్టు ప్రతిఏటా ఏప్రిల్ లో రెండు రంగులలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ 2 రంగులలో కనిపించే ఆ ఇప్ప చెట్టు ఎక్కడ ఉంది.? ఆ ఇప్ప చెట్టు ప్రత్యేకత ఏంటో చూసోద్దాం రండి.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హీరాపూర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న ఈ ఇప్ప చెట్టు రెండు రంగులలో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ చెట్టు చూడడానికి ఒకే చెట్టు అయినప్పటికీనీ చెట్టు కాండం కింది భాగం నుండి ఒకే క్రమంలో ఉన్న కొంత పై భాగం నుండి రెండు కాండాలుగా వేరైపోయాయి. వాటి కొమ్మలు ఒకవైపు ఆకుపచ్చగాను మరోవైపు ఎరుపువర్ణంలోనూ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇది కేవలం ఏప్రిల్ మాసంలోనే రెండు రంగులలో కనిపిస్తూ ఉంటుంది. ఒకే చెట్టు ఇలా రెండు వర్ణాలలో కనిపించడం చూపరులనీ మంత్రముగ్ధులను చేస్తోంది.

ఏప్రిల్ మాసంలో ఇప్ప చెట్టు పూతకు వస్తుంది పూత దశలో ఇలా ఒకవైపు ఆకుపచ్చగాను ఒకవైపు ఏరుపు వర్ణంలోనూ ఈ చెట్టు రంగు మారుతుంది. పూత రాలడం అయ్యాక దీనికి ఇప్ప కాయలు వస్తాయి. ఇప్ప కాయలు వచ్చాక యధావిధిగా ఈ ఇప్ప చెట్టు పూర్తిగా ఆకుపచ్చ వర్ణంలోకి మారిపోతుంది. ఇలా ప్రతి ఏటా గత కొన్నేల్లుగా ఈ ఇప్ప చెట్టు ఏప్రిల్ మాసంలోనే పూత దశలో ఉన్నప్పుడు ఇలా రెండు రంగులలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ చెట్టును చూసిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగడం.. చెట్టు కింద కాసేపు సేదతీరుతు.. నీడలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ..ఒకే చెట్టును ఇలా రెండు రంగులలో ఉండడం చూస్తూ సంబరపడిపోతుంటారు. ఏటా ఏప్రిల్ మాసంలో రెండు రంగులలో కనిపిస్తూ తిరిగి యధావిధిగా ఆకుపచ్చ వర్ణంలోకి మారిపోవడం దీని యొక్క ప్రత్యేకత.

ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో ఎక్కువ పెద్ద మొత్తంలో ఈ ఇప్ప చెట్లు ఉన్నాయి. ఈ ఏప్రిల్ మాసంలో ప్రస్తుతం ఇప్ప చెట్లు పూత దశలో ఉన్నాయి. ఆదిలాబాద్ అడవుల్లో అరుదుగా లభించే ఇప్పపువ్వులను అడవి బిడ్డలు ఉదయాన్నే సేకరించి వాటిని ఎండబెట్టి వివిధ రకాల వంటకాలు తయారుచేసి తింటారు. ముఖ్యంగా ఇప్ప పువ్వు లడ్డులను తయారు చేస్తూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఇప్ప పువ్వు లడ్డులను అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. అలాగే ఇప్ప పువ్వుతో ఇప్పకళ్ళును తీస్తుంటారు. దిన్ని ఇప్ప సార అని కూడా అంటారు. పూర్వం అడవి బిడ్డలు ఎక్కువగా ఇప్ప కళ్ళును ఎక్కువగా వినియోగించే వారు కానీ ప్రస్తుతం కొంతమేర తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా అడవి బిడ్డలు ఇప్పచెట్టును తమ ఆదిదైవంగా కొలుస్తుంటారు. తమ భీమ్ దేవుడిగా భావిస్తుంటారు.

ఏటా మే నెలలో ఇప్ప చెట్టు కింద చంచి భీమన మర్మి అనే కార్యక్రమం నిర్వహిస్టుంటారు. ఇలా ఇప్పచెట్టు ఆదివాసులకు తమ సాంప్రదాయంలో భాగంగా పూజించడంతోపాటు వివిధ రకాల వంటకాలలోనూ వినియోగంలోకి వస్తుంది. ఏది ఏమైనా ఈ యొక్క ఈ ప్రకృతి ఒడిలో ఎన్నో రకాల వింతలు విశేషాలలో ఈ ఇప్పచెట్టు ప్రస్తుతం చోటు దక్కించుకుంది. హీరాపూర్ లో ఉన్న ఈ ఇప్ప చెట్టును కాపాడాలని, గ్రామాలలో సైతం ఇప్ప చెట్లను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.