Lokesh key remarks in media Chitchat: అమరావతిలోని అసెంబ్లీ లాబీల్లో మంత్రి నారా లోకేష్ మీడియాతో జరిపిన చిట్ చాట్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఆయన విపక్ష వైఎస్సార్‌సీపీపై విరుచుకుపడ్డారు. దేవదేవుడికి జరిగిన మహాపచారానికి సంబంధించిన పూర్తి వాస్తవాలను, ఆధారాలను అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. దేవుడిని కూడా రాజకీయాల కోసం రోడ్డు మీదకు తీసుకురావడం, దేవుడి ఫోటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం అత్యంత ఆక్షేపణీయమని ఆయన మండిపడ్డారు.

అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టు పెట్టి పిలవరు !

అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ సభ్యులు గైర్హాజరు కావడంపై లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. శాసనసభకు రావాలని ఎవరికీ బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా సభకు వచ్చి చర్చల్లో పాల్గొనడం వారి బాధ్యత అని హితవు పలికారు. సభను బహిష్కరించడం ద్వారా వారు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. యువగళం పాదయాత్ర తర్వాత ప్రజలతో ఏర్పడిన చిన్న విరామాన్ని భర్తీ చేసేందుకు, ప్రజాప్రతినిధుల కుటుంబాలతో ఆత్మీయ భేటీలు నిర్వహిస్తున్నానని, వీటిలో ఎలాంటి రాజకీయాలూ లేవని వివరించారు.

ఇందాపూర్ కేవలం కో ప్యాకర్ మాత్రమే !

హెరిటేజ్ వ్యాపారాల అంశంపై వస్తున్న ఆరోపణలను లోకేష్ తీవ్రంగా తిప్పికొట్టారు. హెరిటేజ్ సంస్థకు, ఇందాపూర్ డెయిరీకి ఎటువంటి యాజమాన్య సంబంధం లేదని, అది కేవలం కో-ప్యాకర్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సాక్షి మీడియా, భారతి సిమెంట్స్ వంటి సంస్థలు వెయ్యి కోట్ల రూపాయల మేర ప్రజాధనంతో లబ్ధి పొందాయని, కానీ తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఆశించలేదన్నాు. ఈ అంశంలో ఎలాంటి చర్చకు అయినా సరే సవాల్ విసిరారు. కిలో వెయ్యి రూపాయలు ఉండే నెయ్యిని కేవలం 360 రూపాయలకే కొనుగోలు చేయడం ద్వారానే గత పాలకులు నాణ్యతను బలిపెట్టారని విమర్శించారు.

మ్యాచ్‌కు పులివెందుల ఎమ్మెల్యేను తీసుకెళ్తా !

క్రీడల అంశంపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తాను తప్పక వెళ్తానని తెలిపారు. ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే కూడా మ్యాచ్ చూడటానికి వస్తానంటే, ఆయనకు కూడా టికెట్ తానే స్వయంగా కొని ఇస్తానని సెటైర్ వేశారు. ఇటీవల ప్రెస్మీట్ లో మ్యాచ్ చూడటానికి శ్రీలంక పోవాల్సిన అవసరం ఏముందని.. టీవీలో చూడవచ్చు కదా అని జగన్ కామెంట్ చేశారు. దానికి లోకేష్ ఇలా కౌంటర్ ఇచ్చారు.