Nandigama Municipal Chairman : రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థి విషయంలో ఇప్పటికీ చర్చలు సాగుతూనే ఉన్నాయి. టీడీపీ అధిష్టానం శాఖమూరి స్వర్ణలతకు భీఫామ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈమెకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతు ఇస్తుండగా.. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాత్రం ఎంపీ ప్రతిపాదించిన అభ్యర్థిని తిరస్కరించారు. సత్యవతికే భీపామ్ ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. తాను ప్రకటించే అభ్యర్థే ఫైనల్ అంటూ వాదనకు దిగారు. దీంతో నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ మరింత తీవ్రమైంది. అంతకుముందు తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామలో ఎన్నికను వాయిదా వేశారు. కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉత్కంఠగా సాగిన ఎన్నిక

ఏపీలో పలు మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక రసవత్తరంగా సాగింది. హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌గా టీడీపీకి చెందిన రమేశ్‌ ఎన్నిక కాగా, ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్‌ స్థానాలతో పాటు బుచ్చిరెడ్డిపాలెం డిప్యూటీ చైర్మన్‌ పదవులను కూడా టీడీపీ సొంతం చేసుకుంది. 40 మంది సభ్యులున్న హిందూపురం కౌన్సిల్‌లో 23 మంది మద్దతు పలకడంతో రమేశ్‌ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఇక ఏలూరు విషయానికొస్తే.. రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను సైతం తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఉమామహేశ్వరరావు, దుర్గాభవానీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారని అధికారులు ప్రకటించారు. మరోపక్క నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్‌ ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లుగా టీడీపీ మద్దతు అభ్యర్థులు ఎరటపల్లి శికుమార్‌ రెడ్డి, పటాన్‌ నస్రిన్‌ ఎన్నికయ్యారు.

నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు ఏర్పాట్లు

నందిగామ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పీఠం కోసం పలువురు కౌన్సిలర్లు ఆశాలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఉన్న 8వ వార్డు కౌన్సిలర్‌ శాఖమూరి స్వర్ణలత ఇంతకుముందు నందిగామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆమె రెండు సార్లు ఈ వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఇక 5వ వార్డు కౌన్సిలర్‌ ఏచూరి రత్నకుమారి భర్త ఏచూరి రామకృష్ణ టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఎలాగైనా తన భార్యకు అధికారం పట్టం కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనకు కూటమి ప్రభుత్వం ఇటీవలే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇచ్చింది. మరోపక్క 14వ వార్డు కౌన్సిలర్‌, టీడీపీ సీనియర్‌ నాయకురాలు కామసాని సత్యవతి కూడా చైర్‌పర్సన్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నామని, ఏడుపదుల వయస్సుకు దగ్గర పడుతున్న తనకు చివరి అవకాశంగా ఈ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

మరో పక్క రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనుండగా, మార్చి 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఈ పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 10 వరకు గడువు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 13 వరకు గడువు పెట్టారు.

Also Read : Green Field Airport: భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి