Mufasa The Lion King OTT Release Date: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ది లయన్ కింగ్ (2019)' సినిమాకు ఫ్రీక్వెల్‌గా 'ముఫాసా: ది లయన్ కింగ్' (Mufasa: The Lion King) చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌పై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించగా.. బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని అందుకుంది. 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమాకు తెలుగులో టైటిల్ రోల్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) వాయిస్ ఓవర్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది విడుదలైన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం పిల్లల దగ్గర నుంచీ పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంది. సుమారు రూ.1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3,200 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతోంది.

అప్పటి నుంచే ఓటీటీలోకి..

'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమా ఫిబ్రవరి 18వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో (Disney Plus Hotstar) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అదనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఫ్రీగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఆపై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో ఆన్ డిమాండ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ సినిమా తెలుగులో టైటిల్ రోల్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించగా.. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. అలాగే, ఈ సినిమాలో సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.

Also Read: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్