<p>Journalist Injured in Mohan Babu Attack at His home: హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడిన జర్నలిస్టుకు వైద్యులు సర్జరీ చేశారు. జర్నలిస్ట్ రంజిత్‌కు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. రెండు, మూడుచోట్ల ఫ్రాక్చర్ అయిన జైగోమాటిక్ ఎముకకు వైద్యులు సర్జరీ చేశారు. మరో మూడు, నాలుగు రోజులు ఆ జర్నలిస్టును అబ్వరేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారు. జర్నలిస్టుకు మెదడు, తలలో అంతర్గతంగా ఏమైనా డ్యామేజీ జరిగిందా అని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్య తలెత్తుతుందా అని టెన్షన్ పడుతున్నారని సమాచారం. </p>
<p>న్యూస్ కవరేజ్ కోసం జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసానికి మంగళవారం సాయంత్రం వెళ్లిన సమయంలో మీడియా ప్రతినిధి రంజిత్‌పై నటుడు ఒక్కసారిగా దాడి చేయడం కలకలం రేపింది. నమస్తే అంటూ జర్నలిస్ట్ వద్దకు వచ్చిన మోహన్ బాబు ఒక్కసారిగా రంజిత్ చేతిలో ఉన్న న్యూస్ కవర్ చేస్తున్న మైకును లాక్కున్నారు. అంతటితో ఆగకుండా తీవ్ర ఆవేశంతో జర్నలిస్టు తలపై కొట్టడంతో అంతర్గతంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం జర్నలిస్టును హాస్పిటల్ తరలించగా పరీక్షించిన డాక్టర్లు ఆయనకు జైగోమాటిక్ బోన్ ఫ్యాక్చర్ అయినట్టుగా నిర్ధారించారు. సర్జరీ సైతం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు డాక్టర్లు ఆ జర్నలిస్టుకు సర్జరీ చేసి బోన్ ఫ్రాక్చర్ సరిచేశారు. అయితే మూడు, నాలుగు రోజులు వైద్య పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని, కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.</p>