Sugar-Free Mango Kheer : మామిడి పండును చాలామంది ఇష్టంగా తింటారు. దీనితో చేసిన వంటకాలు కూడా చాలా ఇష్టపడతారు. దాదాపు మ్యాంగోలతో షేక్స్, ఐస్ క్రీమ్, స్మూతీలు, స్వీట్స్ వంటి అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ వీటన్నింటిలో మామిడి ఖీర్ బెస్ట్ అని చెప్పవచ్చు. దీని రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఖీర్ అనగానే పంచదార వేస్తారేమో అనుకుంటారు కానీ.. పంచదార లేకుండా మ్యాంగో ఖీర్ టేస్టీగా ఎలా చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

మామిడి పండు తీపి.. పాల క్రీము లాంటి చిక్కదనం, డ్రై ఫ్రూట్స్ గుణాలతో కలగలిసే వంట తినాలనుకుంటే మ్యాంగో ఖీర్ బెస్ట్. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సిరప్ లేదా చక్కెర పాకం లేకుండానే ఇంట్లోనే రుచికరమైన ఖీర్ చేసుకోవచ్చు. మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏమిటో.. తయారీ విధానం ఏమిటో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు

పాలు

కుంకుమ పువ్వు

యాలకుల పొడి

మామిడి పండ్లు (తియ్యనివి)

డ్రై ఫ్రూట్స్

తయారీ విధానం..

మామిడి ఖీర్ తయారు చేయడానికి ముందుగా మందపాటి అడుగు ఉన్న పాత్రలో పాలు మరిగించండి. తక్కువ మంట మీద పాలు కాగనిస్తూ.. క్రమంగా చిక్కబడే వరకు ఉడికించండి. పాలు సగానికి తగ్గి.. మీగడలాంటి చిక్కదనం వచ్చినప్పుడు అది దాదాపుగా సిద్ధమైనట్లే. ఇప్పుడు చిక్కబడిన పాలలో పంచదారకు బదులుగా కుంకుమపువ్వు, యాలకుల పొడి వేయండి. కుంకుమపువ్వు రంగు, సువాసన రెండింటినీ ఇస్తుంది. యాలకులు ఖీర్‌కు ఒక ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.

సుమారు మరో 5 నిమిషాలు ఉడికించి.. ఆ తర్వాత స్టౌవ్ ఆపేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఎందుకంటే వేడి పాల మిశ్రమంలో మామిడి పండు కలిపితే పాలు విరిగిపోయి ఖీర్ పాడైపోవచ్చు. అందువల్ల, దానిని గది ఉష్ణోగ్రతకు చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా పండిన, తియ్యని మామిడి పండ్లను తీసుకుని.. మెత్తని గుజ్జు అయ్యేలా మిక్సర్‌లో గ్రైండ్ చేసుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత.. మామిడి గుజ్జును వేసి బాగా కలపండి. పాలు, మామిడి గుజ్జు కలిసేలా మెల్లగా గిలకొట్టండి. దీనివల్ల మృదువైన, క్రీములాంటి మిశ్రమం ఏర్పడుతుంది.

మీకు ఇష్టమైతే ఖీర్ రుచిని మరింత పెంచడానికి మామిడిని చిన్న ముక్కలుగా చేసి దానిలో కలపవచ్చు. చివరిగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కలపండి. ఆ తర్వాత ఖీర్‌ను 2-3 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టండి. అది పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ మ్యాంగో ఖీర్ రెడీ. దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టంగా తినవచ్చు. అలాగే పంచదార వద్దు అనుకున్నవాళ్లు కూడా హాయిగా దీనిని ఆస్వాదించవచ్చు.