Mahanati Savitri 90th Jayanthi Celebrations In Hyderabad Ravindra Bharathi : ఆమె సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే ఓ అద్భుతం. ఎమోషన్... సీరియస్... కామెడీ ఇలా పాత్ర ఏదైనా దానికి జీవం పోయడం ఆమెకే సాధ్యం. అప్పట్లో స్టార్ హీరోల ఇమేజ్‌ను మించి క్రేజ్ సొంతం చేసుకున్నారు. గుండమ్మ కథ, మిస్సమ్మ, దేవదాస్, మాయా బజార్ ఇలా ఒకటేమిటీ ఆ మహానటి నటించిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యమే. తన కెరీర్‌లో దాదాపు 250కు పైగా సినిమాల్లో తెలుగు ప్రేక్షకుల మదిలో 'మహానటి'గా చెరగని ముద్ర వేశారు సావిత్రి.

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో 1936, డిసెంబర్ 6న జన్మించిన సావిత్రి... తొలుత నాటక రంగంలో ప్రవేశించి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని 'మహానటి'గా కీర్తి పొందారు. ఆమె 90వ జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు

హైదరాబాద్ రవీంద్ర భారతిలో డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకూ సావిత్రి 90వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి తెలిపారు. 'సావిత్రి మహోత్సవ్' పేరిట ఈ వేడుకలు నిర్వహిస్తుండగా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకూ సావిత్రి మూవీస్ ప్రదర్శనతో పాటు పాటల పోటీలు ఉంటాయని చెప్పారు.

ప్రముఖ కళా సంస్థ 'సంగమం' ఫౌండేషన్‌తో కలిసి ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకకు మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించనుండగా... మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చెప్పారు. వీరితో పాటే సినీ ప్రముఖులు వేడుకలకు రానున్నట్లు తెలిపారు.

Also Read : కియారా సిద్ధార్థ్ మల్హోత్రా లిటిల్ ప్రిన్సెస్ - కుమార్తెకు స్టార్ కపుల్ క్యూట్ నేమ్, అర్థం ఏంటో తెలుసా?

'మహానటి' మేకర్స్‌కు సత్కారం

అలనాటి 'మహానటి' సావిత్రి బయోపిక్‌ను రీసెంట్‌గా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. 'మహానటి' సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయారు. ఈ మూవీలో ఆమె నటనకు నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఈ సందర్భంగా డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90వ జయంతి సభలో 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకా దత్, స్వప్నాదత్‌లనూ సత్కరించనున్నట్లు సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి తెలిపారు. అలాగే, 'సావిత్రి క్లాసిక్స్' పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను ప్రత్యేకంగా సత్కరిస్తున్నట్లు చెప్పారు.