LPG Cylinder Prices Hiked | న్యూఢిల్లీ: కొత్త నెల తొలి రోజులనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచాయి. నేటి (జూన్ 1) నుంచి దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) వినియోగదారులపై అదనపు ఇంధన భారం పడనుంది. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 42 మేర పెరిగింది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price)లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం సామాన్యులకు ఊరట కలిగిస్తోంది.

హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర
సవరించిన ధరల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 42 పెరగడంతో రిటైల్ ధర సిలిండర్‌కు రూ. 3,113.50 కి చేరింది. అలాగే హైదరాబాద్‌లో రూ.52 మేర పెరగడంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367 అయింది. కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 53.50 పెరగడంతో రిటైల్ ధర రూ. 3,255.50 కి చేరుకుంది.

ఈ తాజా ధరల పెంపు వల్ల కమర్షియల్ ఎల్‌పీజీపై ఎక్కువగా ఆధారపడే రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, చిన్న తరహా ఆహార వ్యాపార సంస్థలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగితే ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా సామాన్యుడికి భారంగా మారుతుంది. హోటల్, రెస్టారెంట్స్ లలో ఫుడ్ ఐటమ్స్ ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ సవరించిన ధరలు జూన్ 1 నుండి అమలులోకి వచ్చాయి.

5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ ధరలు కూడా పెరిగాయి
కమర్షియల్ సిలిండర్లతో పాటు, ఆయిల్ కంపెనీలు 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (FTL) సిలిండర్ల ధరలను కూడా పెంచాయి. ఢిల్లీలో 5 కిలోల ఎఫ్‌టిఎల్ (FTL) సిలిండర్ ధర రూ. 11 పెరగగా, ఇప్పుడు దీని రిటైల్ ధర రూ. 821.50 గా ఉంటుందని వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా చిన్న తరహా వ్యాపార సంస్థలు, సబ్సిడీ లేని ఎల్‌పీజీ సరఫరా అవసరమయ్యే వినియోగదారులు ఈ ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.