woman bold choice in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో సినిమా స్టోరీని తలపించే ఒక వింత ప్రేమకథ ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి, తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడటమే కాకుండా, తన భర్తను కాదని ఆ యువకుడిని పెళ్లాడిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ వింత బంధం గురించి తెలిసిన పోలీసులు, స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

సంభల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే వివాహమై, 16, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కాలక్రమేణా ఆమెకు తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా క్రమంగా గాఢమైన ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 20 ఏళ్లు ఉన్నప్పటికీ, ఆమె తన భర్తను, సంసారాన్ని వదిలేసి ఆ యువకుడితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని మొరాదాబాద్‌లోని ఛాజ్లేట్‌ గ్రామంలో ఉన్న తన ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ వారిద్దరూ గ్రామస్తుల మధ్య, బంధువుల మధ్య వివాహం చేసుకున్నారు. తన భార్య కనిపించడం లేదని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్న భర్తకు అసలు విషయం తెలిసి గుండె ఆగినంత పనైంది. తన భార్య మరో వ్యక్తితో పెళ్లి పీటల మీద, నుదుటిన సింధూరంతో మెరిసిపోవడం చూసి ఆయన షాక్‌కు గురయ్యాడు.

ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి పోలీసుల వరకు చేరింది. భర్త , అత్త ఆమెను ఇంటికి రమ్మని ఎంత బతిమాలినా, ఆ మహిళ మాత్రం ససేమిరా అంది. తన ప్రియుడితోనే ఉంటానని భీష్మించుక కూర్చుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సదరు యువకుడు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా, ఆమె ఇద్దరు కుమార్తెలను కూడా తన పిల్లలుగా స్వీకరించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అక్కడున్న పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.

పోలీస్ స్టేషన్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మహిళ కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా ఆమె వినకపోవడంతో, చివరకు భర్త , అత్త వెనుదిరిగారు. ఈ అసాధారణ ప్రేమకథ ఉత్తరప్రదేశ్ అంతటా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయసుతో సంబంధం లేని ఈ వింత బంధంపై స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.