Krishna Water Issue: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీ ఇంకా తెగలేదు. కృష్ణా జలాలపై తమ వాటాలపై ఇంకా ఎటూ తేలలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాలను తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధ కృష్ణా బోర్డు ఆఫీసులో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. కృష్ణా బోర్డు మెంబర్‌ సెక్రటరీ సతీష్‌ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేశ్‌బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి సమావేశం అయ్యారు. ఆగస్టు 25న జరిగిన సమావేశంలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో బోర్డు సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. తిరిగి శుక్రవారం మరోసారి బోర్డు సమావేశం జరిగినా.. ఎలా ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ నెల చివరి వారంలో మరోసారి జరిగే కృష్ణా బోర్డు సమావేశానికి కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ బోర్డు అధ్యక్షత వహించనున్నారు.

200 టీఎంసీలు Vs 104 టీఎంసీలు

ఎల్‌నినో ప్రభావంతో.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోని నీటి నిల్వలను తాగునీటికే వినియోగించాలని మొదటిగా చర్చించారు. కృష్ణా బేసిన్‌లో ప్రజలకు ఎక్కువ భాగం తాగునీటిని సరఫరా చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాలకు 50% వాటా కింద నీటిని విడుదల చేయాలని తెలంగాణ కోరింది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు 200 టీఎంసీలు కేటాయించాలని కోరింది. తమ అవసరాలకు 104 టీఎంసీల కేటాయించాలని ఏపీ.. కృష్ణా బోర్డును కోరింది. ఏపీ, తెలంగాణలకు 66:34 నిష్పత్తిని అమలు చేస్తూ తక్షణమే తమకు 97 టీఎంసీల నీళ్లు విడుదల చేయాలని ఏపీ కోరింది. అయితే ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండడంతో 50 శాతం చొప్పున జలాలు కేటాయించాలని తెలంగాణ కోరింది.

Also Read: ఏపీ స్థానిక సమరంలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కూటమి వ్యూహాలు - చంద్రబాబు మార్క్ వ్యూహాలతో రెడీ!

నీటిని పొదుపుగా వాడుకోండి -బోర్డు

పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తున్నారని తెలంగాణ ఆరోపించింది. దీనిపై ఏపీ స్పందిస్తూ న్యాయబద్దంగా వచ్చిన నీటి నుంచే పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా తీసుకుంటున్నట్లు పేర్కొంది. అవసరం లేకున్నా.. తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదులుతోందని పేర్కొంది. దానిని వెంటనే అడ్డుకోవాలని కోరింది. దీనికి తెలంగాణ స్పందిస్తూ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిని వెంటనే నియంత్రణ కోరింది. ఎల్‌నినో ప్రభావంతో ఇరు రాష్ట్రాలు ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని బోర్డు మెంబర్‌ సెక్రటరీ సతీష్‌ కాంబోజ్‌ సూచించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటి విడుదలను ఏపీ నియంత్రించాలి. విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయడాన్ని తెలంగాణ ఆపాలని కోరారని మినిట్స్‌లో తెలియజేశారు.

Also Read: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!

ఇరు ఈఎన్సీలు ఇలా

పులిచింత, కేడీఎస్, తుంగభద్రతో సహా అనేక ప్రాజెక్టుల్లో, పెన్నా బేసిన్‌లో 80 టీఎంసీలు ఉన్నాయని తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు తెలిపారు. పోతిరెడ్డిపాడు 19 టీఎంసీలు, చెన్నై తాగునీటి కోసం 15 టీఎంసీలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబరు వరకు 22 టీఎంసీలు తీసుకుంటామని ఏపీ చెప్పిందన్నారు. ఇప్పటికే 20 టీఎంసీలు వాడుకున్నారన్నారు. వెలిగొండ నుంచి కూడా వాడుకుంటూ.. ఇంకా పాత నిష్పత్తిలో నీటి కేటాయింపు కావాలని కోరడం సరికాదన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఏపీకి 104 టీఎంసీలు కావాలని కోరామని ఏపీ ఈఎన్సీ నరహింమూర్తి తెలిపారు. తెలంగాణ 200 టీఎంసీలు కావాలనడం సరికాదన్నారు.

Also Read: మరో సుదీర్ఘ పాదయాత్రకు వైఎస్ జగన్ వచ్చే ఏడాది శ్రీకారం - పార్టీలో సమస్యలన్నింటికీ పరిష్కారం వచ్చేస్తుందా?