Khanapur Municipal Chairman | ఖానాపూర్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎంపికలో గందరగోళం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన కోరం ఎంపిక ప్రక్రియలో 9వ వార్డు కౌన్సిలర్ బిజెపి అభ్యర్థి అంకం మౌనిక చైర్మన్ గా.. 6వ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అభ్యర్థి సోయబ్ వైస్ చైర్మన్ గా ఎంపిక కాగా.. అధికారికంగా అధికారులు నిర్ధారించలేదు.

గందరగోళంతో రేపటికి వాయిదా వేసిన అధికారులు

ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తమకు ముందు అవకాశం ఎందుకు ఇవ్వలేదని వాగ్వాదానికి దిగారు. తమ కోరం అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారంటు ఫైర్ అయ్యారు. దీంతో గందరగోళం జరగగా అధికారులు రేపటికి వాయిదా వేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి తమ కౌన్సిల్ సభ్యులతో వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్, బిజెపి కౌన్సిల్ సభ్యులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా ఖానాపూర్ నియోజక వర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్, బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ రితేష్ ఆందోళనకు దిగారు.

అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే రోడ్డుపై పడుకొని ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఆపై కొందరు ఒక్కసారిగా పరుగెత్తుతూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లారు. దీనికి తోడుగా మరికొందరు గందరగోళం సృష్టించగా అదుపు చేసే క్రమంలో పోలీసులు పలువురిని లాఠీలతో చెదరగొట్టారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్తితి నెలకొంది.

అనంతరం కలెక్టర్ రావాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఆపై అక్కడి నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసారూ. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎంపిక ప్రక్రియ రేపటి వాయిదా పడటంతో ఇంకా ఏం జరగనుందో మరింత ఉత్కంట భరితంగా మారింది.