Khaleda Zia Net Worth | ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో అతిముఖ్యమైన నేతగా భావించే మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. ఆమె ఢాకాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. చాలా కాలం పాటు దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా గౌరవం పొందారు.

ఖలీదా జియా 1945లో జలంధర్ (ప్రస్తుతం భారతదేశం)లో జన్మించారు. 1959లో ఆమె వివాహం చేసుకున్న జియా ఉర్ రెహమాన్, తరువాత బంగ్లాదేశ్ అధ్యక్షులయ్యారు. 1981లో జియా ఉర్ రెహమాన్ సైనిక అధికారులచే హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఖలీదా జియా జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది.

రాజకీయాల్లోకి ప్రవేశం, అధికార పీఠం వరకు ప్రయాణం

భర్త హత్య తర్వాత ఖలీదా జియా క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె 1984లో బీఎన్‌పీ అధ్యక్షురాలయ్యారు. ఆమె నాయకత్వంలో ప్రతిపక్షం 1991 ఎన్నికల్లో గెలిచి, ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. ఆమె మూడుసార్లు ప్రధానిగా సేవలు అందించారు. ఆమె మొదటి పదవీకాలం మార్చి 1991 నుండి ఫిబ్రవరి 1996 వరకు, రెండవ పదవీకాలం ఫిబ్రవరి 1996 తర్వాత కొన్ని వారాల పాటు, మూడోసారి అక్టోబర్ 2001 నుండి అక్టోబర్ 2006 వరకు ప్రధానిగా సేవలు అందించారు.

ఖలీదా జియా నికర ఆస్తి ఎంత?

ఖలీదా జియా మొత్తం ఆస్తికి సంబంధించి బహిరంగంగా ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే, 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె వార్షిక ఆదాయం సుమారు 1.52 కోట్ల బంగ్లాదేశీ టాకాగా నివేదించారు. దీనితో పాటు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, దుకాణాల అద్దెల ద్వారా సంవత్సరానికి 67,31,314 టకా (49 లక్షలు) ఆదాయం వస్తుంది. షేర్లు, సేవింగ్స్ సర్టిఫికెట్లు, బ్యాంక్ డిపాజిట్ల నుండి 85,09,813 టాకా (62 లక్షల రూపాయలు) ఆదాయం వస్తుంది.

ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఖలీదా జియా వద్ద 50,300 టకా నగదు ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 4,77,85,267 టకా (3 కోట్ల 51 లక్షలు) ఉన్నాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా వద్ద ఉన్న కార్ల విలువ 48,65,000 టకా (35 లక్షల 81 వేల రూపాయలు). ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ 5,00,000 టకా (3 లక్షల 68 వేలు) ఉన్నాయి.