<p>Telangana News | ఆదిలాబాద్: జిల్లాలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో అటవీశాఖ అధికారుల చర్యలకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అడ్డుకట్ట వేశారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలను అడ్డుకోవద్దని సంబంధిత జిల్లాల అటవీ అధికారుకారులకు సూచనలు జారీ చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ ను కొండా సురేఖ ఆదేశించారు. </p>
<p>ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ లో మంగళవారం కలిశారు. రాత్రి వేళల్లో అటవీ చెక్ పోస్టుల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ఎఫ్డిపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు రిక్వెస్ట్ లేఖపై స్పందించిన మంత్రి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పిసిసిఎఫ్ కు సూచించారు. రాత్రి వేళల్లో అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు అనుమతించాలని పిసిసిఎఫ్ ను ఆదేశించారు.<br /><br /></p>