TRS Party Kavitha Sympathy Strategy: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ వేదికగా కన్నీళ్లు పెట్టుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి జైలు జీవితం గడపడం, ఆ తదనంతర పరిణామాల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి తనను పక్కన పెట్టడం, కుటుంబపరంగా ఎదుర్కొన్న ఒంటరితనాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. భారత రాజకీయాల్లో కన్నీళ్లు, భావోద్వేగాలు ఎప్పుడూ అత్యంత ప్రభావవంతమైన సెంటిమెంట్ ఆయుధాలే. ప్రత్యేకించి మహిళా నాయకులు ప్రజా సమక్షంలో తమ ఆవేదనను వెళ్లగక్కినప్పుడు, ప్రజలు దానిని సొంత బిడ్డ లేదా సోదరి పడుతున్న కష్టం గా భావిస్తే అది బలమైన రాజకీయ సింపతీగా మారి ఓట్ల రూపంలో వ్యక్తమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

సెంటిమెంట్ బలంగా ప్రయోగించిన కవిత

నిజామాబాద్ కోడలిగా మీ ముందుకు వచ్చాను, మీ బిడ్డగా అడుగుతున్నాను అని కవిత పిలుపునివ్వడం ద్వారా పక్కా లోకల్ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేశారు. 2014లో ఎంపీగా గెలిచి, 2019లో ఓటమి చవిచూసిన నిజామాబాద్ మళ్లీ తన రాజకీయ పునరాగమనానికి సరైన వేదిక అని ఆమె భావిస్తున్నారు. బిఆర్ఎస్ నుంచి వేరుపడి తెలంగాణ రక్షణ సేన పేరిట కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ తరుణంలో, తనకు జరిగిన అన్యాయాన్ని మరియు పడ్డ కష్టాలను ప్రజల ముందు ఉంచి సానుభూతి సాధించడం కవిత ముందస్తు రాజకీయ వ్యూహంలో అత్యంత కీలక భాగం. నాయకుల కన్నీళ్లు ఒక్కసారికి ప్రజల దృష్టిని ఆకర్షించగలవు. కానీ ఆ కన్నీళ్లను ఓట్లుగా మార్చాలంటే క్షేత్రస్థాయిలో సెంటిమెంట్‌కు తోడు బలమైన సంస్థాగత నిర్మాణమూ అవసరం.

సింపతీ ఆయుధం – సానుకూలతలు , సవాళ్లు

తెలంగాణలోని మహిళా ఓటర్లతో కవితకు బతుకమ్మ పండుగ ద్వారా మొదటి నుంచీ ప్రత్యేక అనుబంధం ఉంది. జైలు కష్టాలను, సొంత పార్టీలోనే సొంత నాయకులే పక్కన పెట్టారన్న ఆవేదనను బహిర్గతం చేయడం వల్ల ద్వితీయ శ్రేణి మహిళా కేడర్‌లో సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. బిఆర్‌ఎస్ అసలైన టిఆర్ఎస్ పేరులోని తెలంగాణ గుండెచప్పుడును కోల్పోయిందని విమర్శిస్తూ, తాను తెలంగాణ రక్షణ సేన గా రావడం ద్వారా గులాబీ కేడర్‌ను తనవైపు తిప్పుకోవాలనేది ఆమె ప్లాన్. తాను అనుభవించిన శిక్ష అక్రమ కేసుల వల్ల వచ్చిందేనని నిరూపించుకునే ప్రయత్నం ఈ సభలో స్పష్టంగా కనిపించింది. కవిత సెంటిమెంట్ కార్డు ఉపయోగిస్తున్నప్పటికీ, కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్లు ఆమెపై చేసిన అవినీతి ఆరోపణలను ప్రజలు ఎంతవరకు మర్చిపోతారు అనేది పెద్ద ప్రశ్న. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడంపై ప్రతిపక్షాలు వేసే విమర్శల దాడిని ఈ కన్నీళ్ల సెంటిమెంట్ దాటగలదా అనేది చూడాలి. కేవలం సానుభూతి మాత్రమే ఎన్నికలను గెలిపించలేదు. కొత్తగా పెట్టిన పార్టీకి గ్రామస్థాయిలో పోలింగ్ బూత్ కమిటీలు, బలమైన నాయకత్వం నిలబడకపోతే, ఓటర్ల సానుభూతి ఓటుగా మారకుండా కేవలం జాలి గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

మరి కవిత వ్యూహం సక్సెస్ అవుతుందా?

రాజకీయాల్లో సానుభూతి అనేది ఒక ప్రారంభ పాయింట్ మాత్రమే గానీ, అది విజయాన్ని నిర్ణయించే ఆఖరి మెట్టు కాదు. గతంలో ఇందిరా గాంధీ నుంచి మొదలుకొని సోనియా గాంధీ, జగన్ మోహన్ రెడ్డి , జయమ్మ వరకు సెంటిమెంట్ వర్కవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ కవిత విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన సంక్షేమ పథకాలతో ఉండటం, మరోవైపు బీజేపీ నిజామాబాద్‌లో బలంగా పాతుకుపోవడం వల్ల పోటీ త్రిముఖంగా ఉంది. నిజామాబాద్ వేదికగా కవిత రగిల్చిన ఈ సెంటిమెంట్ మంటలు ఆమెకు రాజకీయంగా కొంత పునాదిని, ఉనికిని కల్పించవచ్చు. అయితే, ఈ సానుభూతిని కేవలం కన్నీళ్ల ప్రసంగాలకే పరిమితం చేయకుండా, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే స్ట్రాంగ్ లీడర్ గా రూపాంతరం చెందితేనే తెలంగాణ రక్షణ సేన సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.