KA Paul on Botsa Satyanarayana | వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేఏ పాల్ మాట్లాడుతూ.. బొత్స సత్యనారాయణకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదని, అలాంటి వ్యక్తి మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి విజయసాయిరెడ్డి వైదొలిగిన అంశంపై ప్రశ్నిస్తే, బొత్స తన గురించి అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. గతం మర్చిపోయి బొత్స పిచ్చికుక్క కరిచినట్లు ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర పదజాలంతో నిప్పులు చెరిగారు.

డబ్బులు అడుక్కోవడం మర్చిపోయావా?

గతంలో విజయనగరం సభలో లక్షలాది మంది ప్రజల ముందు బొత్స సత్యనారాయణ తన పాదాల వద్ద కూర్చుని ఎన్నికల్లో గెలిపించాలని వేడుకున్న విషయాన్ని ఈ సందర్భంగా పాల్ గుర్తుచేశారు. నిధులు, విరాళాల కోసం తన వద్దకు వచ్చారని ఆరోపించారు. తాను ప్రపంచ శాంతి కోసం, యుద్ధాలను నివారించడానికి అమెరికా సహా వివిధ దేశాల్లో పర్యటిస్తుంటే, బొత్స సత్యనారాయణ ప్రజల సొమ్మును లక్షల కోట్లలో దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తాను అనాథలను, వితంతువులను ఆదుకుంటూ శాంతి సభలు నిర్వహిస్తుంటే, ప్రజల కష్టాలను పట్టించుకోని వీరు తన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు పాల్. విజయనగరం సభలో డబ్బులు అడుక్కోవడానికి వచ్చిన విషయం మర్చిపోయావా? అని ప్రశ్నించారు.

బొత్సకు ఇంకా బుద్ధి రాలేదు

దేవుడు వైకల్యం ఇచ్చినా బొత్స సత్యనారాయణకు ఇంకా బుద్ధి రాలేదని, తనపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజల సొమ్మును దోచుకునే దొంగలకు ఓట్లు వేసిన వాళ్లు నష్టపోతారని, భవిష్యత్తులో అలాంటి నాయకులకు ఓట్లు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read: Veligonda Credit Theft: వైఎస్సార్‌ స్వప్నం వెలిగొండ మేం పూర్తి చేశాం.. చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు: జగన్‌