Japan bans Indian mango export: జపాన్ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న భారతీయ మామిడి పండ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన , శుద్దీకరణ ప్రక్రియలో లోపాలున్నాయంటూ జపాన్ ప్రభుత్వం భారతీయ మామిడి దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. భారతీయ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీలలో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ , డిసిన్ఫెక్షన్ ప్రక్రియలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని జపాన్ క్వారంటైన్ అధికారులు గుర్తించారు. మార్చి 25, 2026 తర్వాత జారీ చేసిన ఇన్‌స్పెక్షన్ సర్టిఫికేట్లు కలిగిన ఏ రకమైన మామిడి షిప్‌మెంట్లను తమ దేశంలోకి అనుమతించబోమని జపాన్ ప్లాంట్ ప్రొటెక్షన్ స్టేషన్ స్పష్టం చేసింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు మామిడి ఎగుమతులకు పీక్ సీజన్ కావడంతో, ఈ నిర్ణయం భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

లోపాలు ఎక్కడ జరిగాయి?

మామిడి పండ్ల ద్వారా తెగుళ్లు వ్యాపించకుండా ఉండేందుకు రసాయన రహితంగా చేసే వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ ప్రక్రియను జపాన్ అధికారులు ప్రతి ఏటా పర్యవేక్షిస్తారు. ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహ్మాన్‌పూర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వసతులను పరిశీలించిన జపాన్ బృందం.. ఫ్యూమిగేషన్ , శుద్దీకరణ చర్యల్లో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. భారతీయ సౌకర్యాలు తమ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపడే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రకటించింది.

ప్రభావం పడే మామిడి రకాలు

జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన అల్ఫోన్సో , కేసర్ , లంగ్రా , మన తెలుగు రాష్ట్రాల గర్వకారణమైన బంగానపల్లి రకాల ఎగుమతులకు బ్రేక్ పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్‌కు చెందిన కేసర్ మామిడి జపాన్ మార్కెట్‌లో సింహభాగాన్ని ఆక్రమించింది. మొత్తం ఎగుమతుల విలువ సుమారు 1.54 మిలియన్ డాలర్ల వరకు ఉండగా, ఇప్పుడు ఒక్కసారిగా ఆర్డర్లు రద్దు కావడంతో రైతులు, వ్యాపారులు అయోమయంలో పడ్డారు.

🚨 Japan has officially halted the import of fresh Indian mangoes for the current season.

This decision comes after Japanese plant quarantine officials discovered significant deficiencies in fumigation and disinfection procedures at Indian treatment facilities during a… pic.twitter.com/Csry7orGW5

— Indian Tech & Infra (@IndianTechGuide) May 28, 2026

20 ఏళ్ల నాటి చేదు జ్ఞాపకాలు

భారతీయ మామిడిపై జపాన్ నిషేధం విధించడం ఇది రెండోసారి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006లో ఇలాంటి ఒక సుదీర్ఘ నిషేధం తొలిగింది. 1986లో పండ్ల ఈగలు సోకుతాయనే భయంతో జపాన్ విధించిన నిషేధం రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. అప్పట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి కమల్ నాథ్ నిరంతర చర్చలు, శాస్త్రీయ పరీక్షల తర్వాత 2006లో ఆ నిషేధాన్ని ఎత్తివేయించారు. ఇప్పుడు మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత అదే తరహాలో క్వారంటైన్ ఆంక్షలు రావడం ఆందోళన కలిగిస్తోంది.

భవిష్యత్తు ఏంటి?

జపాన్ మార్కెట్ చిన్నదే అయినప్పటికీ, అక్కడి క్వారంటైన్ నిబంధనలు ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ప్రస్తుతం అమెరికా, యూఏఈ, యూకే , నెదర్లాండ్స్ వంటి దేశాలు భారత మామిడికి పెద్ద మార్కెట్లుగా ఉన్నప్పటికీ, జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇతర దేశాలు కూడా నిఘా పెంచే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వద్ద లోపాలను సరిదిద్ది జపాన్ అధికారులతో చర్చలు జరిపితే తప్ప ఈ ఏడాదికి మామిడి ఎగుమతులు పట్టాలెక్కేలా కనిపించడం లేదు.