Amazon Prime Video Original Series Isakapatnam Review In Telugu: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ఇసకపట్నం'. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజీవ్ కనకాల, నరేష్ అగస్త్య, సునీల్, రవి వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.

కథ (Isakapatnam Web Series Story Explained In Telugu): బతుకుదెరువు కోసం 1985లో ఇసకపట్నం వచ్చిన వ్యక్తి నాయుడు (సముద్రఖని). లోకల్ లీడర్ చిన్నా రావు (రాజీవ్ కనకాల) దగ్గర పనికి చేరతాడు. బర్మా నుంచి వచ్చిన వలస కూలీలు, స్థానిక ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్ళే అతడిని గంగమ్మ తల్లి జాతరలో చంపి నాయకుడిగా ఎదుగుతాడు నాయుడు.

పదిహేనేళ్ళకు ఇసకపట్నంలో నాయుడి మాటకు అడ్డు లేని పరిస్థితి. ఆయన దారికి ఎదురొచ్చే వాడు లేకుండా పోతాడు. నాయుడు కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్)కి తండ్రి చేసే పనులు ఇష్టం ఉండవు. జనాల్లో తండ్రి మీద భయం పోయేలా స్పీచులు ఇవ్వడం, సమాజ సేవ చేయడం మొదలు పెడుతుంది. అదే సమయంలో నాయుడు దగ్గర పని చేసే పోతన (జ్వాలా కోటి) తెర వెనుక పావులు కదపడం మొదలు పెడతాడు.

ఎవరెన్ని చేసినా ఇసకపట్నాన్ని, పోర్టును నాయుడు తన గుప్పిట్లో పెట్టుకోలిగాడా? లేదా? అధికారం పోకుండా చూసుకున్నాడా? లేదా? తన దగ్గర పని చేసే సూరి (సుధాకర్ కొమాకుల)తో కూతురు భారతి ప్రేమలో పడినట్టు నాయుడుకు తెలుసా? లేదా? నాయుడు మనుషులు చంపేసిన సీఐ స్థానంలో కొత్తగా వచ్చిన వర్మ (సునీల్) ఎవరు? ఆటో డ్రైవర్ పెద్దన్న (నరేష్ అగస్త్య) ఏం చేశాడు? నాయుడును ఎదిరించి నిలబడిన వాళ్ళు ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా? లేదా? నాయుడు కుడిభుజం కోటయ్య (బెనర్జీ) మరణానికి కారణం ఎవరు? కోటయ్య కొడుకు శేఖర్ (రాజా చెంబోలు) ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Isakapatnam Review In Telugu): విశాఖకు వలస వచ్చిన మనుషులను భయంతో తన గుప్పిట్లో పెట్టుకున్న నాయకుడు, ఆ నాయకుణ్ణి ఎదిరించిన ఓ కథానాయకుడు అంటే తెలుగు ప్రేక్షకులకు 'ఛత్రపతి' గుర్తుకు వస్తుంది. ఓటీటీకి వచ్చేసరికి 'పరంపర' వెబ్ సిరీస్ గుర్తుకు వస్తుంది. తెలుగు వెండితెర ప్రేక్షకులు, ఓటీటీ వీక్షకులకు విశాఖ, పోర్టు ఏరియా, స్మగ్లింగ్, రాజకీయాలు వంటివి కొత్త కాదు. ఇప్పటి వరకు వచ్చిన కథల్లో హీరోలు ఉన్నారు. కానీ, 'ఇసకపట్నం'లో హీరోయిన్ ఐశ్యర్య రాజేష్ ఉన్నారు. ఆమెకు తోడు ప్రచార చిత్రాలు సైతం వెబ్ సిరీస్ మీద ఆసక్తి పెంచాయి.

ప్రశాంత్ రగతి కథలో ఆధిపత్య పోరు, రాజకీయ రంగు, ప్రేమ ఉన్నాయి. ఎంగేజ్ చేసే సిరీస్‌కు అవసరమైన నేపథ్యం చక్కగా కుదిరింది. ఈ కథలో కపట నాటక సూత్రధారులకు కూడా లోటు లేదు. అయితే... కథా నేపథ్యానికి తగ్గట్టు బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో దర్శక రచయితలు ఫెయిలయ్యారు. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో', రవితేజ 'క్రాక్' సినిమాల్లో సముద్రఖని పాత్రలను చూస్తే... ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే విలన్ కనపడతాడు. 'ఇసకపట్నం' ఫస్ట్ ఎపిసోడ్‌లో రాజీవ్ కానుకలను ఆయన చంపే సన్నివేశం తెరకెక్కించిన తీరు బావుంది. ఆ తర్వాత నాయుడు స్థాయిని బలంగా చెప్పే సన్నివేశాలు పడలేదు. 'అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో' - 'ప్రస్థానం'లో డైలాగ్ మరోసారి గుర్తుకు వస్తుందీ సిరీస్ చూస్తున్నప్పుడు. క్యారెక్టర్లలో షేడ్స్ ఉన్నాయి. కానీ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు.

Also Read: Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?

సముద్రఖని క్యారెక్టర్ ఒక్కటే కాదు... ఐశ్యర్య రాజేష్, సుధాకర్ కొమాకుల, సునీల్, రాజా చెంబోలు, జ్వాలా కోటి, నరేష్ అగస్త్య - అందరికీ ప్రాధాన్యం ఉన్న పాత్రలు లభించాయి. క్యారెక్టర్లు బావున్నా... క్యారెక్టరైజేషన్లు, బలమైన సన్నివేశాలు మాత్రం పడలేదు. అందువల్ల, చూసేటప్పుడు బోర్ కొట్టదు. అలాగని, 'వాట్ నెక్స్ట్?' అనేంత ఎగ్జైట్‌మెంట్ రాదు. నిదానంగా ముందుకు సాగుతూ వెళుతుంది. మధ్య మధ్యలో సయ్యద్ తాజుద్దీన్ రాసిన డైలాగులు కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 'నాకు కావాల్సింది మగతనం చల్లబడటం కాదు... గుండెల్లో మంట చల్లబడడటం' వంటి మాటలు కొన్ని పేలాయి.

క్లైమాక్స్ ఎపిసోడ్‌లోని గంగమ్మ తల్లి జాతరలో ఐశ్యర్య రాజేష్‌ను చూపించిన సీన్ దర్శకుడిగా గ్యారీ బీహెచ్‌లో ప్రతిభకు ఓ ఉదాహరణ. అమ్మవారిలా ఐశ్వర్యను చూపించినప్పుడు... గూస్ బంప్స్ వస్తాయి. అటువంటి మూమెంట్ ప్రతి ఎపిసోడ్‌కు అవసరం. కానీ, క్రియేట్ చేయలేకపోయారు. కథ, క్యారెక్టర్లు కుదిరినా... స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయడంలో, సీన్స్‌తో ఆసక్తి పెంచడంలో దర్శక రచయితలు వెనక పడ్డారు. చూస్తున్నంత సేపూ ఎక్కడో వెలితిగా అనిపిస్తుంది.

సాధారణంగా వెబ్ సిరీస్‌లలో పాటలకు ప్రాధాన్యం తక్కువ. అయితే గ్యారీ బీహెచ్ పాటలకు చోటు కల్పించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతంలోని బాణీలు కథ, ఆయా సన్నివేశాలకు తగ్గట్టు చక్కగా ఉన్నాయి. రాజీవ్ కనకాల మరణం, రెండు జంటల మధ్య ప్రేమను ఆవిష్కరించిన సందర్భం, క్లైమాక్స్ ఎపిసోడ్‌లో సాంగ్... ప్రతి పాట ఆయా సందర్భానికి తగ్గట్టు ఉన్నాయి. కథను లిరిక్స్‌లో చెప్పారు శ్రీజో. అయితే పాటల స్థాయిలో ఆర్ఆర్ ఇవ్వలేదు. నేపథ్య సంగీతం సాదాసీదాగా ఉంది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. తమడా మీడియా నిర్మాణ విలువలు బావున్నాయి.

Also Read: Maa Inti Bangaram Review - 'మా ఇంటి బంగారం' రివ్యూ: సమంత యాక్షన్ సూపర్... మరి సినిమా హిట్టా? ఫట్టా?

'ఇసకపట్నం'లో తండ్రీ కూతుళ్ళుగా ప్రధాన పాత్రల్లో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ నటించారు. తమ పరిధి మేరకు చేశారు. వాళ్ళ స్థాయికి తగ్గ సన్నివేశాలు పడలేదు. ఎస్సై పాత్రలో సునీల్‌ను సరిగా వాడుకోలేదు. సూరిగా ఆ పాత్రకు అవసరమైన కోపాన్ని, ప్రేమను బాగా చూపించారు సుధాకర్ కొమాకుల. సహజంగా నటించారు. శేఖర్ పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు రాజా చెంబోలు. నరేష్ అగస్త్య నటన ఓకే. 'లక్కీ భాస్కర్'లో రాంకీ తరహా పాత్ర బెనర్జీది. సిరీస్ అంతటా సముద్రఖని వెంట ఉంటారు. సిగ్నేచర్ డైలాగ్ 'హ్యాపీస్'తో అదరకొట్టారు. జ్వాలా కోటి, శుభోదయం సుబ్బారావు అలియాస్ రాజశేఖర్ అనింగి, రవి వర్మ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వాళ్ళ క్యారెక్టర్లు రిజిస్టర్ అవుతాయి. సూరి తమ్ముడిగా 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ ఈశ్వర్ రచిరాజు రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు.

'ఇసకపట్నం'లో కమర్షియల్ సిరీస్‌కు అవసరమైన కథ, క్యారెక్టర్లు, బ్యాక్‌డ్రాప్‌ - అన్నీ కుదిరాయి. ఇందులో మంచి ట్యాలెంటెడ్ ఆర్టిస్టులూ ఉన్నారు. అయితే... ఎగ్జైట్ చేసే స్క్రీన్ ప్లే, ఎంగేజ్ చేసే సన్నివేశాలు మిస్ అయ్యాయి. బోర్ కొట్టదు. అలాగని, సూపర్బ్ అనిపించదు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తే... నెమ్మదిగా కంప్లీట్ చేయవచ్చు.

Also Read: Transfer Trimurthulu Review - ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ: వడ్డే నవీన్ కమ్‌ బ్యాక్ సినిమా... హిట్టా? ఫట్టా?