IPL 2026 RCB vs SRH | బెంగళూరు: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ కళ్లు చెదిరే ప్రదర్శన చేశాడు. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం (మార్చి 28న) రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తన అరంగేట్రంలో 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. కేవలం 8 ఓవర్లకే ఇన్నింగ్స్ లో తన స్పెస్ పూర్తి చేసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇదే మ్యాచ్ ద్వారా అభినందన్ సింగ్ అనే యూపీకి చెందిన పేసర్ సైతం ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.

పవర్ ప్లేలో సన్ రైజర్స్ పై ఆధిపత్యం: సాధారణంగా పవర్ ప్లేలో విధ్వంసం చేసే సన్‌రైజర్స్ ప్రమాదకర ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లను త్వరగా పెవిలియన్ చేర్చాడు జాకబ్ డఫీ. తరువాత నితీష్ కుమార్ రెడ్డిని సైతం పవర్ ప్లేలోనే అవుట్ చేసి హైదరాబాద్ బ్యాటింగ్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అరంగేట్రంలోనే అద్భుత స్పెల్ వేసి SRH జోరుకు బ్రేకులు వేసి ఆర్‌సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన జాకబ్ డఫీ తన మొదటి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. పేసర్ డఫీ వేసిన షార్ట్ పిచ్ బాల్స్, స్వింగ్ సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. అయితే అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్డడంతో ఎవరీ జాకబ్ డఫీ అని క్రికెట్ ప్రేమికులు సెర్చ్ చేస్తున్నారు.

Debut. Done & Dusted. ✅#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #RCBvSRH pic.twitter.com/aGen9veH8k

— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026

ఎవరీ జాకబ్ డఫీ (Jacob Duffy Profile)
జాకబ్ డఫీ ఆగస్టు 2, 1994న న్యూజిలాండ్‌లోని లమ్స్‌డెన్‌లో జన్మించారు. కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలర్. న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఒటాగో (Otago) జట్టు తరపున ఆడుతూ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. 2012లో తన 18వ ఏటనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టి, అతి తక్కువ కాలంలోనే కీలక బౌలర్‌గా ఎదిగాడు.

టీ20ల్లో నెంబర్ 1 ర్యాంక్..

అంతర్జాతీయ స్థాయిలో 2020లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ పేసర్ అరంగేట్రం చేశాడు. డఫీ తన బౌలింగ్‌లో కచ్చితత్వం, స్వింగ్, బౌన్స్‌ను రాబట్టడంలో దిట్ట. ముఖ్యంగా కొత్త బంతితో వికెట్లు తీయడంలో సరైన బౌలర్. 2025 సంవత్సరంలో ఇతను టీ20 క్రికెట్‌లో ఐసీసీ నంబర్ 1 బౌలర్‌గా కూడా నిలిచాడు. న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ 2026లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్' ను కూడా గెలుచుకున్నాడు. మరోవైపు భువనేశ్వర్ సైతం ఉండటంతో ఆర్సీబీకి బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ దొరికినట్లే.

ఆర్సీబీ వేలం వివరాలు (RCB Auction Details)
ఐపీఎల్ 2026 కోసం జరిగిన మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ జాకబ్ డఫీని అతని కనీస ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు ప్రత్యామ్నాయంగా లేదా బ్యాకప్ బౌలర్‌గా జాకబ్ డఫీని ఆర్సీబీ తుది జట్టులోకి తీసుకుంది. తక్కువ ధరకు లభించినప్పటికీ, టీ20ల్లో డఫీకి ఉన్న అనుభవం, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇతడ్ని ఆర్సీబీకి ఒక స్టేల్ డీల్ (తక్కువ ధరకు దక్కిన గొప్ప ఆటగాడు) గా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.