Warning Signs of Infant Seizures : చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్ని కొన్నిసార్లు గుర్తించడం కష్టం. ఎందుకంటే పెద్దవారి మాదిరిగా స్పష్టంగా చేతులు, కాళ్లు కొట్టుకోవడం వంటి లక్షణాలే కనిపించవు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒక్కసారిగా చూస్తూ ఉండిపోవడం, తల వాల్చడం, శరీరం బిగుసుకుపోవడం, పదేపదే విచిత్రమైన కదలికలు చేయడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. వీటిని సాధారణ శిశు కదలికలుగా భావించకూడదని వైద్యులు చెప్తున్నారు.

శిశువుల్లో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందే దశలో ఉంటుంది. ఈ సమయంలో పదేపదే లేదా నియంత్రణలోకి రాని సీజర్లు వస్తే.. మెదడు అభివృద్ధికి సంబంధించిన కొన్ని ప్రక్రియలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు డాక్టర్ లోకేష్ లింగప్ప. హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్లో క్లినికల్ డైరెక్టర్ అండ్ లీడ్ కన్సల్టెంట్, చైల్డ్ అండ్ అడోలెసెంట్ న్యూరాలజిస్ట్, డివిజన్ ఆఫ్ పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్గా చేస్తోన్న డాక్టర లోకేష్ లింగప్ప శిశువుల్లో ఎపిలెప్సీని వీలైనంత త్వరగా గుర్తించి వైద్యపరంగా పరిశీలించడం ముఖ్యమని తెలిపారు.

[quote author=- డాక్టర్ లోకేష్ లింగప్ప]శిశువుల్లో ఎపిలెప్సీ సీజర్లు ఎప్పుడూ స్పష్టంగా కనిపించే మూర్ఛ రూపంలోనే ఉండవు. కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోవడం, అకస్మాత్తుగా శరీరం బిగుసుకుపోవడం, పదేపదే కదలికలు, తల ఒక్కసారిగా వాలిపోవడం లేదా కొద్దిసేపు స్పందించకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అందుకే తల్లిదండ్రులు బిడ్డలో పదేపదే కనిపించే అసాధారణ కదలికలను గమనిస్తే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. [/quote]

Also Read : 15 ఏళ్ల కిడ్స్లో పెరుగుతోన్న లైంగిక సమస్యలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO.. కారణమిదే

పిల్లల్లో ఫిట్స్ ఎందుకు త్వరగా గుర్తించాలి?

పుట్టిన తర్వాత తొలి మూడేళ్లలో పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలోనే పిల్లలు కూర్చోవడం, నిలబడటం, నడవడం, మాట్లాడటం, పరిసరాలకు స్పందించడం వంటి ఎన్నో నైపుణ్యాలను నేర్చుకుంటారు. కాబట్టి ఈ సమయంలో తరచూ సీజర్లు రావడం లేదా వాటికి సరైన చికిత్స అందకపోవడం గురించి వైద్యపరంగా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.

మూడేళ్లలోపు ఎపిలెప్సీ వచ్చిన పిల్లలపై జరిపిన ఒక అధ్యయనంలో 41 శాతం మంది పిల్లలకు కనీసం నెలపాటు డయాగ్నసిస్ ఆలస్యమైనట్లు గుర్తించారు. ఈ ఆలస్యం తక్కువ developmental scores‌తో, ముఖ్యంగా motor development‌లో తక్కువ స్కోర్లతో సంబంధం ఉన్నట్లు పరిశోధనలో కనిపించింది. ఈ ప్రభావం తర్వాతి సంవత్సరాల్లో కూడా కనిపించినట్లు అధ్యయనం సూచించింది.

Also Read : పిల్లల స్కూల్ బ్యాగులు మరీ బరువుగా ఉన్నాయా? వెన్నెముక ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే.. వైద్యుల హెచ్చరికలు

సమస్యను ఆలస్యంగా గుర్తించిన పిల్లల్లో కొన్ని సంవత్సరాల తర్వాత IQ స్కోర్లు కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది ప్రతి ఒక్క శిశువులో ఒకేలా జరగదని కూడా తెలిపారు. ఎపిలెప్సీ రకం, సీజర్ల తీవ్రత, కారణం, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని వెల్లడించారు.

[quote author=- డాక్టర్ లోకేష్ లింగప్ప]శిశువుల్లో మెదడు అభివృద్ధి చాలా వేగంగా జరిగే సమయంలో సీజర్లను గుర్తించి, వాటి కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. పదేపదే వచ్చే లేదా నియంత్రణలో లేని సీజర్లు పిల్లల అభివృద్ధికి సంబంధించిన ప్రక్రియలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అసాధారణ ఎపిసోడ్లను సాధారణ శిశు ప్రవర్తనగా భావించి ఎక్కువకాలం వేచి చూడకూడదు. [/quote]

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

బిడ్డ ఏ కారణం లేకుండా పదేపదే ఒకే రకమైన జెర్కింగ్ మూవ్‌మెంట్స్ లేదా శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోవడం కనిపిస్తే గమనించాలి. అలాగే కొన్ని సెకన్లపాటు ఒకే వైపు చూస్తూ ఉండిపోవడం లేదా పిలిచినా స్పందించకపోవడం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శిశువు పదేపదే తలను ఒక్కసారిగా కిందకు వాల్చడం లేదా తల పడిపోయినట్లుగా కనిపించడం కూడా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.

Also Read : పిల్లల ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? ఆహారం, నిద్ర, వ్యాయామంపై వైద్యులు చెప్పిన విషయాలివే

మునుపెన్నడు చేయని కదలికలను గమనించినా.. ఒక్కసారిగా స్పందించకపోవడం, అలర్ట్‌గా లేకపోవడం లేదా ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తే కారణాన్ని తెలుసుకోవాలి. వయసుకు తగ్గట్టుగా బిడ్డ కూర్చోవడం, నిలబడటం, నడవడం, మాట్లాడటం వంటి developmental milestones గురించి కూడా వైద్యుడితో చర్చించాలి.

[quote author=- డాక్టర్ లోకేష్ లింగప్ప]ప్రతి అసాధారణ కదలిక ఎపిలెప్సీ అని చెప్పలేం. అయితే తల్లిదండ్రులకు అనుమానం కలిగించే విధంగా ఎపిసోడ్లు పదేపదే వస్తుంటే వాటిని వీడియో తీసి వైద్యుడికి చూపించడం ఉపయోగకరంగా ఉంటుంది. అవసరమైతే పిల్లల న్యూరాలజిస్ట్‌ ద్వారా మరింత పరీక్షలు చేయించుకోవచ్చు. [/quote]

లక్షణాలు తీవ్రమయ్యే వరకు చూడకండి

శిశువుల్లో ఫిట్స్ నిర్ధారణ ఆలస్యమయ్యే ప్రధాన కారణాల్లో ఒకటి.. తల్లిదండ్రులు కనిపిస్తున్న అసాధారణ కదలికలను సీజర్లుగా గుర్తించలేకపోవడం. కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్ష సమయంలో ఎపిసోడ్ కనిపించకపోవడం, మరికొన్ని సందర్భాల్లో స్పెషలిస్ట్‌ను సంప్రదించడంలో ఆలస్యం జరగడం కూడా కారణం కావచ్చు.

సీజర్ల రకం, వాటికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి వైద్యులు అవసరమైన టెస్ట్లు చేయిస్తారు. సమస్యను త్వరగా గుర్తిస్తే తగిన చికిత్సతో పాటు పిల్లల అభివృద్ధికి అవసరమైన సపోర్ట్‌ను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించవచ్చు. అందుకే శిశువులో కనిపించే లేదా అర్థం కాని అసాధారణ కదలికలను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లడం మంచిది.

Also Read : వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.