న్యూఢిల్లీ: భారత రవాణా రంగంలో 2027 సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. దేశంలోనే మొదటి బుల్లెట్ రైలును మరో 15 నెలల్లో ప్రారంభించేందుకు 'నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్' (NHSRCL) వేగంగా సన్నాహాలు చేస్తోంది. ముంబయి - అహ్మదాబాద్ - సబర్మతి మధ్య చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా వాపి - బిలిమోరా - సూరత్ మధ్య ఉన్న 98 కిలోమీటర్ల హైస్పీడ్ కారిడార్‌ను 2027 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రూట్‌లో నడిచే బుల్లెట్ రైలు అధికారిక చిత్రాన్ని రైల్వేశాఖ విడుదల చేసింది. మొదట్లో ఈ మార్గంలో 2 బుల్లెట్ రైళ్లను నడపనున్నారు.

ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలే!
ఈ ప్రాజెక్టును వివిధ దశల్లో పూర్తి చేసేందుకు రైల్వేశాఖ, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ప్లాన్ చేసింది. 2027 డిసెంబరు నాటికి వాపి నుంచి సబర్మతి వరకు (352 కి.మీ.), 2028 డిసెంబరు నాటికి థానే నుంచి సబర్మతి వరకు (492 కి.మీ.) పనులను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 2029 డిసెంబరు నాటికి ముంబయి నుంచి సబర్మతి వరకు మొత్తం 508 కిలోమీటర్ల పూర్తి మార్గాన్ని అందుబాటులోకి తెచ్చి, మొత్తం 30 బుల్లెట్ రైళ్లను ఈ మార్గంలో నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. గంటకు గరిష్ఠంగా 320 కి.మీ. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే.. ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అన్ని స్టాపుల్లో ఆపినా కూడా కేవలం 2 గంటల 58 నిమిషాలు మాత్రమే పడుతుందని అంచనా వేశారు.

Also Read: Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు

వేగంగా సాగుతున్న నిర్మాణ పనులు..
ఇటీవల NHSRCL అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రాజెక్ట్ పురోగతిని వివరించారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వంద శాతం పూర్తయింది. మెట్రో తరహాలో ఎత్తులో ట్రాక్ నిర్మించేందుకు అవసరమైన భారీ కాంక్రీట్ స్తంభాల (పియర్లు) పనులు 91 శాతం పూర్తయ్యాయి. స్తంభాలపై అమర్చే భారీ కాంక్రీట్ బీమ్‌ల తయారీ (గిర్డర్ కాస్టింగ్) 76 శాతం కాగా, వాటిని పియర్లపై అమర్చే పనులు (గిర్డర్ లాంచింగ్) 72 శాతం పూర్తయ్యాయి. రైలు పట్టాల కోసం నిర్మించే బేస్ (ట్రాక్‌బెడ్) పనులు 35 శాతం, ఎలక్ట్రిక్ వైర్లు, స్తంభాలకు సంబంధించిన ఓహెచ్‌ఈ పనులు 33 శాతం మేర పూర్తయ్యాయి.

ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రత్యేకతలు
భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మక ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు మొత్తం 508.90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండనుంది. ఈ మొత్తం దూరంలో అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో 349.03 కి.మీ., మహారాష్ట్రలో 154.76 కి.మీ., కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ డయ్యూలో 4.30 కి.మీ. మార్గం ఉంది. ప్రయాణికులకు సేవలు అందించేందుకు మొత్తం 12 స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో 8 స్టేషన్లు గుజరాత్‌లో, మిగిలిన 4 మహారాష్ట్రలో రానున్నాయి. సాంకేతిక పరంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో వినూత్నంగా సాగుతోంది. ఈ మొత్తం రూట్‌లో అత్యధిక భాగం అంటే 465.38 కి.మీ. (91.58 శాతం) వయాడక్ట్స్‌ (ఎత్తులో నిర్మించే వంతెనల మార్గం) పైనే సాగుతుంది. దీనితో పాటు 9.82 కి.మీ. (1.93 శాతం) మేర నదులు, ఇతర వంతెనలు, అలాగే 6.75 కి.మీ. (1.3 శాతం) మేర ఇతరత్రా నిర్మాణాలు చేపడతారు.

ముంబై- అహ్మదాబాద్ ప్రయాణానికి విమానంలో 1.10 గంటలు (70 నిమిషాలు) పడుతుంది. కానీ చెకిన్ సమయం లాంటివి కలుపుకుంటే మరో 2 గంటలు అదనంగా కేటాయించాలి. మొత్తంగా 3 గంటలకు పైగా పడుతుంది. రైలులో వెళ్లడానికి 6 గంటల వరకు పడుతుండగా.. కారు లాంటి వాహనాల్లో 8 గంటల్లో వెళ్లవచ్చు. అదే బుల్లెట్ రైలు అయితే కనిష్టంగా 2 గంటల 7 నిమిషాలు, గరిష్గటంగా 2 గంటల 58 నిమిషాల్లో మీ డెస్టినేషన్ చేరుకోవచ్చు అని అధికారులు తెలిపారు.